సామర్థ్యాలు పెంచేలా బోధన ఉండాలి: కలెక్టర్ పమేలా సత్పతి

విధాత: పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలు పెంచే విధంగా బోధన చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ అధ్వర్యంలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వ‌హించారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు కమ్యూనిటీ యూత్ బిఎ, బిఇడి, ఎంబిఎ విద్యార్థుల ద్వారా బోధన కల్పించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్ దేఖో […]

సామర్థ్యాలు పెంచేలా బోధన ఉండాలి: కలెక్టర్ పమేలా సత్పతి

విధాత: పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలు పెంచే విధంగా బోధన చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ అధ్వర్యంలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వ‌హించారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు కమ్యూనిటీ యూత్ బిఎ, బిఇడి, ఎంబిఎ విద్యార్థుల ద్వారా బోధన కల్పించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్ దేఖో స్వచ్చంద సంస్థ శిక్షణా కార్యక్రమం నిర్వహించింది.

శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి స్థాయి పాఠశాలల విద్యార్ధులలో అభ్యసనా సామర్ధ్యం పెరిగే విధంగా తొలిమెట్టు కార్యక్రమంలో పొందుపరచిన గైడ్లైన్స్ ప్రకారం బోధన చేసేందుకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

ఇందులో భాగస్వామ్యం అవుతున్న వారంద‌రికీ అభినందనలు తెలుపుతున్నానని, ఈ కార్యక్రమం ఇంటర్న్ షిప్ గా పరిగణించి జిల్లా యంత్రాంగం తరపున సర్టిఫికెట్స్ అందిస్తామని తెలిపారు. వారంలో రెండు రోజులు పాఠశాలల్లో విద్యా బోధన చేయాలని సూచించారు.

ప్రతి తరగతికి కొన్ని సామర్ధ్యాలు ఉంటాయని, బిగ్గరగా చదివించడం, తెలుగులో చదవడం, వ్రాయడం, ఎన్ని చదవాలి, ఎన్ని వ్రాయాలి, వాటిని ఎలా అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్న తరువాత తిరిగి చెప్పేలా, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం లాంటివి చతుర్విధ ప్రక్రియలలో పిల్లల సామార్థ్యాలు పెరిగేలా చూడడం ముఖ్యమన్నారు.

ప్రతి తరగతికి తగిన సామర్ధ్యాన్ని పెంపొందించడం దీని ఉద్దేశ్యమన్నారు. పిల్లలకు సామర్ధ్యం వచ్చాక వేరొక పాఠానికి వెళ్లాలని, వారి సామర్ధ్యాలపై దృష్టి పెట్టి సాధించేలా చూడాలని, బోధనోపకరణలు వాడాలని, వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు.

కార్యక్రమంలో భారత్ దేఖో కోఆర్డినేటర్ అభిజిత్, రోమిలా, మాస్టర్ ట్రైనర్ అనిల్ కమ్యూనిటీ యూత్ బిఎ, బిఇడి, ఎంబిఎ విద్యార్థులకు శిక్షణ అందించారు. విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు అండాళ్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.