మళ్లీ ఇదే రోజు పార్లమెంటుపై దాడి

కొత్త పార్లమెంటులో లోక్‌సభ సమావేశాలు జరుగుతుండగా టీయర్ గ్యాస్ దాడి చేసిన ఘటన సంచలనం రేపుతున్నది.

మళ్లీ ఇదే రోజు పార్లమెంటుపై దాడి
  • నిందితులిద్దరు యువతీ యువకులు

విధాత : కొత్త పార్లమెంటులో లోక్‌సభ సమావేశాలు జరుగుతుండగా టీయర్ గ్యాస్ దాడి చేసిన ఘటన సంచలనం రేపుతుంది. జీరో ఆవర్‌లో జరిగిన ఈ దాడితో లోక్‌సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకిన ఇద్దరు దుండగులు సభలో టీయర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలు భయంతో పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. నిందితులు ఎవరన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. కేంద్ర భద్రత సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. నిందితుల్లో ఒకరు అమోల్ షిండే, మరొకరు నీలం కౌర్‌లుగా గుర్తించారు. పార్లమెంటు వెలుపల కూడా ఇద్దరు యువకులు పసుపు రంగు పొగలు వెదజల్లుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దుండగులు కాలి షూలలో గ్యాస్ క్యాన్‌లు పెట్టుకుని విజిటర్స్ రూపంలో గ్యాలరీలో వెళ్లారు. లోక్‌సభ సమావేశాలు జరుగుతుండగా జీరో అవర్‌లో వారు గ్యాలరీ నుంచి సభలోకి దూకి పసుపు రంగు గ్యాస్ వదిలారు. వెంటనే దుండగులిద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దుండగులు తానాషాహి బంద్‌కరో.. నియంతృత్వం చెల్లదు.. రాజ్యంగాన్ని కాపాడాలి..   జై బీమ్‌.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో విజిటర్స్ పాస్‌లతో సభలోకి వచ్చారు.

2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు అప్పుడు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు.ఈ ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది.

మళ్లీ కొత్త పార్లమెంటు భవనంలో గతంలో పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగిన డిసెంబర్ 13ననే సెంట్రల్ విస్తాలో లోక్‌సభ సమావేశాల సందర్భంగా అగంతకులు టీయర్ గ్యాస్ దాడికి పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటన పార్లమెంటు వద్ద భద్రతా వ్యవస్థ వైఫల్యాలను మరోసారి బయట పెట్టినట్లయ్యింది.

ఇటీవల ఖలిస్తాన్‌కు చెందిన నేత గురుపత్వంత్ సింగ్ గతంలో పార్లమెంటు భవనంపై ఇస్తామిక్ ఉగ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13 రోజునే తాము భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త పార్లమెంటు భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. సరిగ్గా ఇదే రోజున దాడి జరుగడం సంచలనంగా మారింది.