రెండు రోజుల్లో 93 శాతం రైతు బందు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది

రెండు రోజుల్లో 93 శాతం రైతు బందు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం

16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం

కాళేశ్వరంపై 100రోజుల్లో విచారణ పూర్తి

యాదాద్రి ఫ్లాంట్‌…విద్యుత్తు కొనుగోలుపై రిటైర్డ్ జడ్జీతో విచారణ

తొలి విడత ఇందిరమ్మ ఇండ్లు 4.56లక్షలు

అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులు

మంత్రి మండలి నిర్ణయాలు 

వెల్లడించిన మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, పొన్నం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ తొలి విడత కింద 4.56లక్షల ఇండ్లు మంజూరీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మీడియాకు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 22,500 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు రోజుల్లో 93శాతం రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని, రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని, ఏకలవ్య, బంజారా, ఆదివాసీ ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు నిర్ణయించామని మంత్రులు తెలిపారు. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. మహిళా సాధికారత కోసం 

15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం కోసం క్యాబినెట్ నిర్ణయం నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించబోతున్నట్లుగా తెలిపారు. 

కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ..

గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై, కాళేశ్వరం అవినీతిపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ వేయాలని, వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేయాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. 2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రులు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసి, ఈ రెండు పేర్లను గవర్నకు పంపించాలని నిర్ణయించామని పేర్కోన్నారు.

ఆర్ధిక క్రమశిక్షణతో నిర్ణయాలు

ఆర్థిక క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుంటూ వంద రోజులలోపే హామీల అమలుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులందరం ఒక టీమ్ గా పని చేస్తున్నామని, మేం ఎన్నికల కోసం నిర్ణయాలు తీసుకోవడం లేదని, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరు గ్యారంటీలు వందరోజుల్లోపే అమలు చేస్తున్నామని, బీఆరెస్ బావబామ్మర్దులు కేటీఆర్‌, హరీశ్‌రావులు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా నిర్మాణ ప్రతిపక్ష పాత్ర పోషించాలని, రోజూ పిచ్చివాగుడు వాగోద్దని, కేసీఅర్ లక్ష అబద్ధాలు చెప్పాడని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని విమర్శించారు.