తెలంగాణ మళ్లీ బీఆర్‌ఎస్‌దేనా!

కలిసిరానున్న ఓట్ల చీలిక బరిలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యత (విధాత ప్రతినిధి, హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కేసీఆర్ మళ్లీ గెలుస్తారా? బీజేపీ ఎత్తుగడలు ఫలిస్తాయా? కాంగ్రెస్ అధికారానికి రావడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే విజయావకాశాలు మెరుగుగా ఉన్నాయని సర్వేలు, రాజకీయ అధ్యయనాలు […]

  • By: krs    latest    Dec 23, 2022 5:13 AM IST
తెలంగాణ మళ్లీ బీఆర్‌ఎస్‌దేనా!
  • కలిసిరానున్న ఓట్ల చీలిక
  • బరిలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ
  • మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యత

(విధాత ప్రతినిధి, హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కేసీఆర్ మళ్లీ గెలుస్తారా? బీజేపీ ఎత్తుగడలు ఫలిస్తాయా? కాంగ్రెస్ అధికారానికి రావడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే విజయావకాశాలు మెరుగుగా ఉన్నాయని సర్వేలు, రాజకీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. మెజారిటీ స్థానాలలో ఇప్పటికీ టీఆర్‌ఎస్‌కే ఆధిక్యత ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నట్టు ఈ సర్వేల ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి.

సర్వేలలో చాలా నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌కు 35 నుంచి 40 శాతం లోపే ఓట్లు వస్తున్నాయి. చాలా నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 60 నుంచి 65 శాతం ఓట్లు ఉన్నప్పటికీ అవి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ వంటి అనేక పార్టీల మధ్య చీలిపోయే అవకాశం ఉన్నందున టీఆర్‌ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అధికారికంగా వచ్చింది 46.8 శాతం ఓట్లు వచ్చాయి.

ఆ తర్వాత ఆరు నెలలకు 2019 ఏప్రిల్లో‌ జరిగిన లోకసభ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఓట్లు 41.7 శాతానికి పడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలలో 97 లక్షల ఓట్లు రాగా, లోకసభ ఎన్నికలలో 76.9 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 14.4 లక్షల ఓట్లు(6.6 శాతం) రాగా లోకసభ ఎన్నికల్లో 36.2 లక్షల ఓట్లు(19.6 శాతం) వచ్చాయి. బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 58.8 లక్షల ఓట్లు(28.4 శాతం), లోకసభ ఎన్నికలలో 54.9 లక్షల ఓట్లు(29.7) గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేసింది. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 7.2 లక్షల ఓట్లు వచ్చాయి

ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇరవై నియోజకవర్గాలలో మాత్రమే టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నది. ఆ నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌కు 40 నుంచి 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు రెండూ బలంగా టీఆర్‌ఎస్‌తో తలపడే నియోజకవర్గాల సంఖ్య పెరిగే కొద్దీ టీఆర్‌ఎస్‌ విజయావకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే సుమారు యాభై నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో ఇప్పటికీ 110 స్థానాల్లో బలమైన పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే. కాంగ్రెస్ 75 నుంచి 80 స్థానాల్లో మాత్రమే బలమైన పునాది కలిగి ఉంది. బీజేపీ ఇప్పటికీ 30 నుంచి 35 స్థానాల్లో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలలో కూడా ఎక్కడయినా బలమైన అభ్యర్థులు దొరికిన చోట మాత్రమే బీజేపీ గట్టి పోటీలో ఉండే అవకాశం ఉంది. బీజేపీది పైపై పటా టోపమే తప్ప అట్టడుగు స్థాయిలో నిర్మాణం లేదని జిల్లాల వారీగా పరిశీలన చేసినప్పుడు వెల్లడవుతున్నది. బీజేపీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టి బలపడాలని ప్రయత్నిస్తున్నది తప్ప ప్రజల ఆమోదాన్ని పొందే ఎజెండా ఏదీ ముందుకు తేవడం లేదు.

బీజేపీ ప్రారంభించిన రాజకీయ విద్వేషపూరిత సంభాషణ రాష్ట్రంలో మొత్తం రాజకీయ చర్చను అథమాథమ స్థాయికి తీసుకెళుతున్నదని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇటువంటి విపరీత రాజకీయ చర్చ ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ చాలా వర్గాలను దూరం చేసుకున్నా, సంక్షేమ ఫలాలు పొందుతున్న వర్గాలు ఆ పార్టీకి నికర ఓటు బ్యాంకుగా పనిచేసే అవకాశం ఉంది. వ్యతిరేక ఓటు చీలిక, సంక్షేమ ఫలాలు పొందే వర్గాల బలం రెండూ టీఆరెస్కు బలమైన అనుకూల అంశాలు. బీజేపీ నాయకత్వం కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయగలుగుతున్నదే కానీ కేసీఆర్‌కు ధీటైన నాయకుడిని ముందు పెట్టలేకపోతున్నది.