పార్టీలో ‘తెలంగాణ’ పదం తొలిగిస్తే.. ప్రజల్లో కూడా పోతుందా?
కేసీఆర్ ఏపీలో ఆకట్టుకోలేరు.. తెలంగాణలో చంద్రబాబు ఆకర్షించగలరు.. తెలంగాణ వాదాన్ని చంపేసిన కేసీఆర్: జగ్గారెడ్డి విధాత: పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలిగించి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత రాజకీయ నేతల్లోనే కాదు సామాన్యుల్లోనూ పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేస్తాయని ఇప్పుడే చెప్పలేము. కానీ దీనితో పాటు జగ్గారెడ్డి మరో కీలక వ్యాఖ్య […]

- కేసీఆర్ ఏపీలో ఆకట్టుకోలేరు.. తెలంగాణలో చంద్రబాబు ఆకర్షించగలరు..
- తెలంగాణ వాదాన్ని చంపేసిన కేసీఆర్: జగ్గారెడ్డి
విధాత: పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలిగించి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత రాజకీయ నేతల్లోనే కాదు సామాన్యుల్లోనూ పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేస్తాయని ఇప్పుడే చెప్పలేము. కానీ దీనితో పాటు జగ్గారెడ్డి మరో కీలక వ్యాఖ్య చేశారు. కేసీఆర్ ఏపీలో ఆకట్టుకోలేరని.. తెలంగాణను చంద్రబాబు ఆకర్షించగలరు అన్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం.
మొదటి విషయానికి వస్తే తెలంగాణ వాదం టీఆర్‌ఎస్ పేటెంట్ హక్కు కాదు. అయితే ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ప్రజల్లో ఆ పార్టీ పట్ల కొంత భావోద్వేగం ఉన్నది. మొదటిసారి ఎన్నికల్లో మాత్రమే తెలంగాణ వాదం కొంత పనిచేసింది.
అప్పటివరకు అందరూ తెలంగాణ అన్నప్పటికీ, రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమంలో కేసీఆర్ మొదలు ఆ పార్టీ నేతలతో ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండంతో వాళ్లకు కొంత ప్రతికూల పరిస్థితి ఉండేది.
ఎందుకంటే అన్నిపార్టీల అభిప్రాయం విన్న కాంగ్రెస్ పార్టీపైనే రాష్ట్ర విభజన నిర్ణయాధికారం ఉండేది. అందుకే టీఆర్‌ఎస్‌కు ఉన్న అనకూలతలు ఆ పార్టీకి లేకుండే. ఫలితంగా ఉద్యమ సమయంలో పదవుల త్యాగాలు, పోరాటాలు టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చాయి.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పైన తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. దానిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. అందుకే మొదటిసారి తెలంగాణవాదం, రెండోసారి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, రైతుబంధు లాంటివి టీఆర్‌ఎస్ తిరిగి రెండోసారి అధికారానికి దోహదపడ్డాయి.
అయితే మొదటి రెండు సార్లు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీనే ఎంచుకున్నారు. ప్రస్తుతం కూడా ఒకవేళ బీఆర్‌ఎస్‌ను వద్దనుకుంటే ఆ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని ఇటీవల వెల్లడైన సర్వేల్లోనూ అది స్పష్టమైంది. బీజేపీకి ఏ మాత్రం అనుకూలంగా లేదని ఆ పార్టీ అధిష్ఠానానికి తెలుసు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత అది అర్థమైంది. అందుకే టీడీపీతో కలిసి వెళ్తే ఇక్కడ ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు అన్నది కమలనాథుల ఆలోచన. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా పనిచేశారు. కాబట్టి ఆయన ప్రభావం ఉంటుంది. బహుశా జగ్గారెడ్డి ఆ దృష్టితోనే వ్యాఖ్యానించి ఉండవచ్చు.
కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన పదవుల పంచాయితీ సీనియర్లు, వలస వచ్చిన నేతల మధ్య విభజన రేఖను గీసింది. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ అందరికీ చేతులు జోడించి ఒక మాట చెప్పారు. సమస్య ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకుని రండి. బహిరంగ విమర్శలు వద్దు అన్నారు. కలిసి కట్టుగా కొట్లాడితే అధికారం దక్కుతుందన్నారు.
రేవంత్‌రెడ్డిపై ఒంటికాలిపై లేచే నేతల్లో జగ్గారెడ్డి కూడా ఒకరు. అయితే కేసీఆర్ తన పార్టీలో తెలంగాణ పదాన్ని తీసివేసినంత మాత్రానా అది తెలంగాణ ప్రజల్లో చెరిగిపోదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న సానుభూతి పోదు.
బాబును ముందుపెట్టి కాషాయ నేతలు వచ్చినా కాంగ్రెస్ స్థానం మారదు. కాబట్టి జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇతర పార్టీల పేరు మార్పు గురించి చర్చించే కంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి ఆలోచిస్తే ఫలితం ఉంటుందని కార్యకర్తలు కోరుకుంటున్నారు.