CM KCR | ప్రతి ఏటా రూ.3 కోట్లతో.. అంబేద్కర్ అవార్డులు.. రూ.50 కోట్లతో ప్రత్యేక నిధి: CM KCR

అవార్డుల కోసం రూ.50 కోట్లతో ప్రత్యేక నిధి  2024 ఎన్నికల్లో రాబోయే రాజ్యం మ‌న‌దే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన విధాత: దేశంలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రతి ఏడాది బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరిట రూ.3 కోట్లతో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అవార్డులకు అవసరమైన రూ.3 కోట్లు సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, బ్యాంకులో డిపాజిట్ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ […]

  • By: Somu    latest    Apr 14, 2023 12:16 PM IST
CM KCR | ప్రతి ఏటా రూ.3 కోట్లతో.. అంబేద్కర్ అవార్డులు.. రూ.50 కోట్లతో ప్రత్యేక నిధి: CM KCR
  • అవార్డుల కోసం రూ.50 కోట్లతో ప్రత్యేక నిధి
  • 2024 ఎన్నికల్లో రాబోయే రాజ్యం మ‌న‌దే
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

విధాత: దేశంలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రతి ఏడాది బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరిట రూ.3 కోట్లతో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అవార్డులకు అవసరమైన రూ.3 కోట్లు సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, బ్యాంకులో డిపాజిట్ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి హృద‌యపూర్వ‌కంగా జై భీమ్ తెలియ‌జేస్తున్నాను. రాష్ట్రంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌యంతి నిర్వ‌హిస్తున్నాం. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోశోన్ని తెలియ‌జేస్తున్నామన్నారు. సంవ‌త్స‌రాలు, శ‌తాబ్దాలు గ‌డిచిపోతున్నాయి. ఒక్క‌టే మాట మ‌నవి చేస్తున్నాను.

అంబేద్క‌ర్ విశ్వ‌మాన‌వుడు, ఆయన ప్ర‌తిపాదించిన సిద్ధాంతం విశ్వ‌జ‌నీన‌మైన‌ది. ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి ప‌రిమితమైంది కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేద్క‌ర్ అని కొనియాడారు. ఈ రోజు ఆయ‌న ర‌చించిన భారత రాజ్యాంగం 70 సంవ‌త్స‌రాలు దాటిపోతోంది. ఆయ‌న చెప్పింది ఆచ‌రించాలి. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ జ‌ర‌పాలని కేసీఆర్ అన్నారు.

నూతనంగా నిర్మించిన స‌చివాలయానికి బి.ఆర్ అంబేద్క‌ర్ సచివాలయంగా నామకరణం చేశాం. ప్ర‌తి రోజు స‌చివాల‌యానికి వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అంబేద్క‌ర్‌ను చూస్తూ వారు ప్ర‌భావితం కావాలనే లక్ష్యంతో. ఆయ‌న సిద్ధాంతం, ఆచ‌ర‌ణ క‌ళ్ల‌లో మెద‌లాల‌ని ఈ విధంగా రూప‌క‌ల్ప‌న చేశాం. ఇది విగ్ర‌హం కాదు, విప్ల‌వం. ఇది ఆకారానికి ప్ర‌తీక కాదు.. ఇది తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక అని కెసిఆర్ పేర్కొన్నారు.

కవి, ఆంధ్ర ప్రాంత దళిత ఉద్యమ నాయకుడు క‌త్తి ప‌ద్మారావు స‌భ‌కు వ‌చ్చారో కాదో తెలియ‌దు కానీ. అంబేద్క‌ర్ పేరిట ఒక శాశ్వ‌త‌మైన అవార్డు నెల‌కొల్పాల‌ని తనకు సూచించారని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రతి ఏడాది బి.ఆర్.అంబేద్క‌ర్ పేరిట అవార్డు ఇస్తామని, అందుకోసం రూ.50 కోట్లు శాశ్వతంగా డిపాజిట్ చేస్తామన్నారు. ఈ డిపాజిట్ ద్వారా ప్రతి సంవ‌త్స‌రం రూ.3 కోట్ల వ‌డ్డీ వ‌స్తుంది. దేశంలో ఉత్త‌మ సేవ‌లందించిన వారికి అంబేద్క‌ర్ జ‌యంతి రోజున అవార్డులు అంద‌జేస్తామని కేసీఆర్ వివరించారు.

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు నిరుపేద‌లు ఎవ‌రంటే ద‌ళితులు అనే మాట విన‌బ‌డుతుంది. ఇది మ‌న‌కు సిగ్గుచేటు, ప‌రిస్థితి మారాలి. ఓడిపోవ‌డం గెల‌వ‌డం కాదు. ప్ర‌జ‌లు గెలిచే రాజ‌కీయం రావాలన్నారు. ఎవ‌రి వైఖ‌రి ఏ విధంగా ఉంది అనేది ఆలోచించాలి. బిఆర్ఎస్ ప్ర‌భుత్వం రావ‌డానికి ముందు 10 ఏండ్లు వేరే పార్టీ రాజ్యం చేసింది. ద‌ళితుల అభివృద్ధి కోసం రూ.16 వేల కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ ప‌దేండ్ల‌లో ద‌ళితుల అభివృద్ధి కోసం ఒక ల‌క్ష 25 వేల 68 రూపాయాలు ఖ‌ర్చుపెట్టామని కేసీఆర్ తెలిపారు.

అద్భుత‌మైన భార‌త‌దేశం అని, ప్రపంచంలో ఎక్క‌డా లేని విధంగా ద‌ళిత‌ బంధు కూడా ప్ర‌వేశ‌ పెట్టామన్నారు. అదే విధంగా నూత‌న స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెట్టుకున్నాం. ఈ నెల 30 ప్రారంభించుకుంటున్నాం. ఆకాశ‌మంతా ఎత్తు ఉండేట‌టువంటి.. ఎక్క‌డా లేని విధంగా ఈ మ‌హోన్న‌త‌మైన విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన ఘ‌న‌త తెలంగాణ ప్ర‌భుత్వానికే ద‌క్కింది. ద‌ళితుల అభివృద్ధి కోసం ద‌ళిత మేధావి వ‌ర్గం ఆలోచించాలని కోరారు.

ఈ రోజు మ‌న‌వి చేస్తున్నాను. జాతీయ రాజ‌కీయాల్లో కూడా ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి పార్టీని జాతీయంగా విస్త‌రించారు అని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ చెప్పారు. 2024 ఎన్నిక‌ల్లో రాబోయే రాజ్యం మ‌న‌దేనని ధీమా వ్యక్తం చేశారు. మ‌హారాష్ట్ర‌లో తమ పార్టీకి ఊహించ‌ని విధంగా ప్రోత్సాహం, ఆద‌ర‌ణ వ‌స్తుంది. యూపీ, బీహార్, బెంగాల్‌తో పాటు ప్ర‌తి చోట వ‌స్తుందన్నారు.

దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం 25 ల‌క్ష‌ల ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత‌ బంధును అమ‌లు చేస్తామన్నారు. అంబేద్క‌ర్ క‌ల‌లు సాకారం కావాలని, త‌ప్ప‌కుండా అవుతాయన్నారు. నిజ‌మైన భ‌క్తితో పేద ప్ర‌జ‌ల‌ను ఆశీర్వ‌దించాలి. విజ‌యం మ‌న‌దే. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల మందికి ద‌ళిత బంధు సాయం అందింది. ఈ ఏడాది ఒక ల‌క్షా పాతిక వేల మందికి అంద‌బోతుందన్నారు. ఈ పథకాన్ని స‌ద్వినియోగం చేయాల‌ని కోరుతున్నాను.

ఈ రోజు దేశంలోనే ఎక్క‌డా లేన‌టువంటి ఆద‌ర్శ‌మూర్తి విగ్ర‌హాన్ని తీర్చిదిద్దినందుకు, ఈ అవ‌కాశం త‌న‌కు దక్కినందుకు నా జ‌న్మ ధ‌న్య‌మైందని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశఆరు. బాబా సాహెబ్ బాట‌లో ఈ దేశాన్ని స‌రైన లైన్‌లో పెట్టేందుకు, చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు పోరాటం చేయ‌డం జ‌రుగుతుందని ప్రకటించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలో రానున్నది బిఆర్ఎస్ తో కూడిన ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా జై భీమ్ తెలియ‌జేసుకుంటూ సెల‌వు తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.