కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారేనా? డిగ్గి రాజా మాట వినేనా!

ముందుగా ఇంచార్జీలతో చర్చలు జరిపిన డిగ్గిరాజా విధాత: ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందిన ఏఐసీసీ అగ్ర నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతిని చల్లార్చగలిగేనా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తిరుగుబాటు ప్రకటించారు. సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రేవంత్‌పై తిరుగుబాటు ప్రకటించారు. అసలు కాంగ్రెస్‌ వాదులను కాదని, టీడీపీ నుంచి వచ్చిన వారికే రేవంత్‌ పదవులు […]

కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారేనా? డిగ్గి రాజా మాట వినేనా!
  • ముందుగా ఇంచార్జీలతో చర్చలు జరిపిన డిగ్గిరాజా

విధాత: ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందిన ఏఐసీసీ అగ్ర నేత దిగ్విజయ్‌ సింగ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన అసమ్మతిని చల్లార్చగలిగేనా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తిరుగుబాటు ప్రకటించారు.

సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రేవంత్‌పై తిరుగుబాటు ప్రకటించారు. అసలు కాంగ్రెస్‌ వాదులను కాదని, టీడీపీ నుంచి వచ్చిన వారికే రేవంత్‌ పదవులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. దీంతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయినా సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలంతా వేరు కుంపటి పెట్టారు.

ఒక దశలో పార్టీని వీడుతారా? అన్న ప్రచారం కూడా జరిగింది. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పంధించింది. వెంటనే ఉమ్మడి రాష్ట్రానికి ఇంచార్జీగా పనిచేసిన దిగ్విజయ్‌ సింగ్‌ను తిరిగి తెలంగాణకు పంపింది.

తెలంగాణలో సీనియర్‌ నేతల తిరుగుబాటును చల్లార్చాలని దిగ్విజయ్‌ సింగ్‌ను ఏఐసీసీ ఆదేశించింది. ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిగ్గిరాజా వెంటనే ఐఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్‌ చేసి అసమ్మతి భేటీని రద్దు చేయాలని కోరారు. ఆయన ఆదేశాలతో అసమ్మతి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ నేతలతో దిగ్గి రాజా మాట్లాడారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరే ముందు ఢిల్లీలోని తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంచార్జీగా ఉన్న మాణిక్యం ఠాగూర్‌తో చర్చించారు. ఇతర ఇంచార్జీలతోను, సీనియర్‌ నేతలతో నూ దిగ్గి రాజా చర్చలు జరిపారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

  • గురువారం వరుస సమావేశాలు

హైదరాబాద్‌కు వచ్చిన తరువాత పార్క్‌ హయత్‌ హోటల్‌లో దిగ్విజయ్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ బస ఏర్పాట్లు చేసింది. గురువారం పార్టీ నేతలతో దిగ్గి రాజా విడివిడిగా మాట్లాడనున్నట్లు తెలిసింది. ఆ తరువాత సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో వేరు కుంపటి పెట్టిన నేతలతోనూ, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితోనూ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటికే రేవంత్‌పై గుర్రుగా ఉన్నసీనియర్లు పీసీసీ అధ్యక్షుడి హొదాలో పాదయాత్ర చేయడానికి అంగీకరిస్తారా? పదవుల విషయంలో ఆయన మాట వింటారా? అన్న సందేహాలు వెలువడుతున్నాయి. పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తప్పించాలని సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్ ముందు డిమాండ్‌ పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

అలాగే పీసీసీ పదవుల విషయంలో కూడా పట్టు బట్టాలని సీనియర్‌ నేతలంతా భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్‌కు వ్యతిరేకంగా చాలా దూరం వెళ్లిన ఈ నేతలు మార్పు లేకుండా కలిసి ఉండాలని దిగ్గి రాజా చెప్పే మాటలు వింటారా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

హైదరాబాద్‌కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. కోమటిరెడ్డితో భేటీ

టీ.కాంగ్రెస్ అసమ్మతిని పరిష్కరించే ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రోటోకాల్ ఇంచార్జ్ వేణుగోపాల్ రావ్, సంగిశెట్టి జగదీష్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హోటల్‌కి చేరుకున్న దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశం అయ్యారు. నేడు కాంగ్రెస్ సీనియర్లతో, రెండు గ్రూపులతో చర్చలు జరిపిన పిదప మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు వివరాలు వెల్లడిస్తానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.