ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కార్యాలయంలా మార్చేశారు: టీఎంసీ ఆగ్రహం

బీజేపీ అసహ్యకర చర్యలు ఎన్నికల కమిషన్‌ను ధ్వంసం చేస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగాలని డిమాండ్‌ చేసింది

  • By: Somu    latest    Mar 19, 2024 11:34 AM IST
ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కార్యాలయంలా మార్చేశారు: టీఎంసీ ఆగ్రహం

కోల్‌కతా: బీజేపీ అసహ్యకర చర్యలు ఎన్నికల కమిషన్‌ను ధ్వంసం చేస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగాలని డిమాండ్‌ చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల దృశ్యాన్ని తారుమారు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డెరెక్‌ ఓ బ్రైన్‌ ఎక్స్‌ వేదికగా మంగళవారం ఆరోపించారు.


‘ఎన్నికల కమిషన్‌ వంటి సంస్థలను బీజేపీ తన దుశ్చర్యలతో నాశనం చేస్తున్నది. ప్రజలను ఎదుర్కొనలేని దుర్బల స్థితిలో బీజేపీ నేతల ఉండి.. ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చేసుకున్నారా?’ అని డెరెక్‌ ఓ బ్రైన్‌ ప్రశ్నించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే లోక్‌సభ ఎన్నికలను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.


మమతాబెనర్జీ ప్రభుత్వం నియమించిన పశ్చిమబెంగాల్‌ డీజీపీ రాజీవ్‌కుమార్‌ను ఎన్నికల కమిషన్‌ తొలగించిన నేపథ్యంలో తృణమూల్‌ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసీ చర్యపై అంతకు ముందు తీవ్రంగా స్పందించిన టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌.. ఎన్నికల సంఘం లాంటి విభిన్న సంస్థలను కూడా గుప్పిట పట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు.


కేంద్ర సంస్థలు, వివిధ ఆర్గనైజేషన్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన ఆధీనంలోకి తీసుకున్నని ఆరోపించారు. ఎన్నికల సంఘం విషయంలోనూ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత అదే ధోరణి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేపథ్యంలో సోమవారం కీలక నిర్ణయాలు తీసుకున్న ఈసీ.. పశ్చిమబెంగాల్‌ డీజీపీ రాజీవ్‌కుమార్‌తోపాటు.. ఆరు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే.