రికార్డు సృష్టించిన ఆ ట్రాన్స్‌జెండర్లు.. ఉస్మానియాలో డాక్టర్లుగా నియామకం
Transgender Doctors | ఆ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు.. అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్రెండ్స్ నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సూటిపోటి మాటలతో.. మీరు అటు మగ కాదు.. ఇటు ఆడ కాదు అని అవహేళన చేశారు. కానీ ఆ ఇద్దరు అవమానాలను, అవహేళనలను పక్కన పెట్టారు. ఎవరెన్ని అన్నా కూడా వారిద్దరూ పట్టించుకోలేదు. తమ ముందున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కసితో చదివారు. ఎవరూ ఊహించని విధంగా డాక్టర్ పట్టా అందుకున్నారు. నిన్నటి వరకు అనేక ప్రయివేటు ఆస్పత్రుల్లో […]

Transgender Doctors | ఆ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు.. అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్రెండ్స్ నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సూటిపోటి మాటలతో.. మీరు అటు మగ కాదు.. ఇటు ఆడ కాదు అని అవహేళన చేశారు. కానీ ఆ ఇద్దరు అవమానాలను, అవహేళనలను పక్కన పెట్టారు. ఎవరెన్ని అన్నా కూడా వారిద్దరూ పట్టించుకోలేదు. తమ ముందున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కసితో చదివారు. ఎవరూ ఊహించని విధంగా డాక్టర్ పట్టా అందుకున్నారు. నిన్నటి వరకు అనేక ప్రయివేటు ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్స్.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో నియామకం అయి రికార్డు సృష్టించారు. అదేక్కడో కాదు.. మన హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో యాంటీ రిట్రో వైరల్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం అయ్యారు.
డాక్టర్లుగా నియాకమైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ప్రాచీ రాథోడ్, రుత్ జాన్‌ఫాల్ కొయ్యాల. రాథోడ్ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రుతు జాన్‌పాల్ 2018లో మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసేందుకు జాన్‌పాల్ హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ట్రాన్స్‌జెండర్ అన్న ఒక్క కారణంతో జాన్‌పాల్‌కు అవకాశం దక్కలేదు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో గతేడాది నారాయణగూడలో తన స్నేహితురాలైన ప్రాచీ రాథోడ్‌తో కలిసి మిత్ర ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ క్లినిక్ బ్రహ్మాండంగా నడుస్తోంది. మంచి పేరు కూడా సంపాదించుకుంది.
ఇక ప్రాచీ రాథోడ్ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్, ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మూడేండ్లు పని చేశారు. ఈ క్రమంలో రాథోడ్ ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో.. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు. అయినప్పటికీ తన ప్రయత్నాలు విడవకుండా ఉద్యోగం కోసం పోరాటం చేసింది. ఏకంగా ఇప్పుడు ఈ ఇద్దరికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి కాంట్రాక్ట్ వైద్యులుగా అవకాశం రావడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు. అయితే ప్రాచీ రాథోడ్, రుతు జాన్‌పాల్ పీజీ చేసేందుకు నీట్ కూడా రాశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మహిళా కోటా కింద వీరికి సీటు వచ్చింది. కానీ చేరలేదు. తమకు ట్రాన్స్‌జెండర్ కోటా కింద సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.