కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై పీఠముడి.. ట్రయాంగిల్ ‘పొలిటికల్’ లవ్‌స్టోరీ
• BRS VS BJP మధ్యలో కాంగ్రెస్ • ఏళ్ళుగా జెండాల ఎజెండా ఒక్కటే • ఎన్నికల ప్రయోజనమే ఏకైక లక్ష్యం • అభివృద్ధి పట్ల అధికార పక్షాల జాప్యం • దశాబ్దాలుగా నిరుద్యోగులకు శాపం విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉత్తర, దక్షిణ భారతానికి గేట్వేగా ఉన్న కాజీపేటలో రైల్వేపరిశ్రమల ఏర్పాటు పై ఏండ్లు గడుస్తున్నా అవసరమైన శ్రద్ధ పెట్టాలనేది మరిచిపోయిన అధికార పార్టీలకు ఎన్నికల ప్రయోజనముంటేనే ఎజెండా పైకి తీసుకరావడం రివాజుగా […]

• BRS VS BJP మధ్యలో కాంగ్రెస్
• ఏళ్ళుగా జెండాల ఎజెండా ఒక్కటే
• ఎన్నికల ప్రయోజనమే ఏకైక లక్ష్యం
• అభివృద్ధి పట్ల అధికార పక్షాల జాప్యం
• దశాబ్దాలుగా నిరుద్యోగులకు శాపం
విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఉత్తర, దక్షిణ భారతానికి గేట్వేగా ఉన్న కాజీపేటలో రైల్వేపరిశ్రమల ఏర్పాటు పై ఏండ్లు గడుస్తున్నా అవసరమైన శ్రద్ధ పెట్టాలనేది మరిచిపోయిన అధికార పార్టీలకు ఎన్నికల ప్రయోజనముంటేనే ఎజెండా పైకి తీసుకరావడం రివాజుగా మారింది. రాజకీయ అవసరం పడితేనే అధికార పార్టీల నాయకులకు కోచ్ ఫ్యాక్టరీ యాదికొస్తున్నది. చర్వితచరణంగా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చిరకాల ప్రజాకాంక్షను అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోరాటం ద్వారా సమస్య పరిష్కారమైతుందని భావించే కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా, కార్మిక, రైల్వే సంఘాలు సహజంగానే వీరి వలలో చిక్కుకుంటున్నాయి.
ఆధిపత్య ఆటకు పావు
రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ హామీ రాజకీయ పార్టీల ఆధిపత్య ఆటకు కేంద్రంగా ఉపయోగపడుతున్నది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండగా ‘ఇచ్చే స్థానంలో ఉండి ఇవ్వకుండా కొర్రీలు పెడుతూ మొండి చేయి’ చూపెట్టడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నదీ. అవసరమొచ్చినప్పుడల్లా ఈ కోచ్ ఫ్యాక్టరీ పై పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని కాలాయాపన చేయడం తప్ప అడుగు ముందుకు పడిందీ లేదు. ఆశతో ఉన్న నిరుద్యోగులకు ఒక్క నౌకరీ కల్పించిందీలేదు. ఓట్లు దండుకోవడానికి పాట్లు పడుతున్నారు.
తన నియోజకవర్గ పరిధి సమస్యకావడంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, చీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఎప్పుడూ కోచ్‌ఫ్యాక్టరీ విషయంలో ముందు వరుసలో ఉంటారు. అవసరమైన సందర్భంలో అందరినీ ముఖ్యంగా సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులను కలుపుకుని సాగుతుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీని, ప్రస్తుతం బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి కోచ్‌ఫ్యాక్టరీ ఎజెండా పైకి తెచ్చి మూడు ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు.
రాజకీయ ఎ‘జెండా’గా కోచ్ ఫ్యాక్టరీ
దశాబ్దంన్నర కాలంగా కోచ్ ఫ్యాక్టరీ రాజకీయ ఎజెండాగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగినంత సేవు ఈ విషయాన్ని మరుగుపరచడం అలవాటైంది. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని అడుగులు ముందుకు వేసి సఫలీకృతమైంది.
ముఖ్య2018లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా విభజన హామీలు, కోచ్ ఫ్యాక్టరీని ఎజెండా చేసి కాజీపేట కేంద్రంగా పోరాటాన్ని ఎక్కుపెట్టారు. బీజేపీ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పోరాటం చేపట్టామని ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత షరా మాములుగా ప్రాధాన్యత మారిపోయి పోరాటం నీరుగారి పోయింది.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వామ్యం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించి ఒక దశలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి ఆఖరి నిమిషంలో వెనుకంజ వేసి ఉద్యమాన్ని చల్లార్చారు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందినతర్వాత మళ్ళీ ఎన్నికలు రానున్నందున నెమ్మదిగా కోచ్‌ఫ్యాక్టరీని పట్టాలెక్కిస్తున్నారు.
అధికార ఆటలో ‘కోచ్’పావు
తాజాగా రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అధికార జూదానికి ఆరాటం పెరిగిన నేపథ్యంలో మరోసారి ‘కోచ్’ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చీఫ్‌విప్ వినయ్ బీజేపీపై విమర్శలు పెంచారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బీఆర్ఎస్ భూమి కేటాయించకుండా జాప్యం చేస్తుందంటూ ప్రతివిమర్శ చేశారు. మూడు పార్టీల రాజకీయ క్రీడలో కోచ్ ఫ్యాక్టరీ, స్థానిక ప్రజల ఆశలు గల్లంతైతున్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి కార్యాచరణ చేపట్టాలని బిఆర్ఎస్ సిద్ధమైతున్నట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలోకాంగ్రెస్ రెండు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పై ఒత్తిడి తెస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవాలనే పార్టీలో అభిప్రాయం వ్యక్తమైతుంది.
ఇదిలాఉండగా తమ ఓట్ల ప్రయోజనం నెరవేరగానే కాడెత్తేయడం ఈ పార్టీల నేతలకు అలవాటైందని అంటున్నారు. అందుకే అప్రమత్తతతో వ్యవహరించాలని ఇతర పక్షాలకు సూచిస్తున్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న రాజకీయ పక్షాలు, సంఘాలు మరో ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
నీరుగారిన నిరుద్యోగుల ఆశ
దాదాపు రెండు దశాబ్దాలుగా కాజీపేట కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీ రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తూ వచ్చారు. ఈ మేరకు తొలి దశలో ప్రొఫెల్లెంట్ ఫ్యాక్టరీ, తర్వాత కోచ్ ఫ్యాక్టరీ, ఓవరాయిలింగ్ బ్రాంచ్, రైల్వే ఛక్రాల పరిశ్రమ ఏర్పాటు తదితర అనేక పరిశ్రమలను వివిధ రూపాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు తెచ్చారు. స్థానికుల్లో ఆశలు కల్పించారు. ఏ ఒక్క ఆశ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం గమనార్హం.
వరంగల్ జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కాజీపేట పట్టణంతో పాటు కార్పొరేషన్లో భాగమైన సోమిడి, టేకులగూడెం, మడికొండ,రాంపూర్, తరాలపల్లి, బట్టు పల్లి,కడిపికొండ తదితర గ్రామలను కలుపుకుంటే లక్ష జనాభా ఉంది. కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ వస్తే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడుతాయని గంపెడాశపెట్టుకున్నారు.
ప్రత్యక్షంగా 60 వేల ఉద్యోగాలలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. అన్ని వర్గాలు స్టేషన్లో పూలు,కూరగాయలు అమ్మే కూలి తల్లి నుండి సాధారణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందనుకున్నారు. కానీ, కోచ్ ప్యాక్టరీ విషయంలో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ల దొంగాట స్థానికులకు శాపంగా మారింది.
మూడు పక్షాల ముచ్చట
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ప్రధానమైన మూడు రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పక్షాల నాయకుల స్పందన ఈ విధంగా ఉంది.
విభజన హామీలకు దిక్కులేదు:
పార్లమెంటు చేసిన చట్టంలో ఉన్న హామీలకే దిక్కు లేకుండా పోయింది. ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా?కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను బీజేపీ కల్లలు చేసింది. అప్పట్లో కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే ఇపుడు బీజేపీ చేస్తుంది.- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర,రాష్ట్ర నిర్లక్ష్యం:
కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం లోనే కాలం వెల్లదీస్తోన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మాటలతో మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎంపీ,ఎమ్మెల్యే అసమర్ధత వల్లే నష్టం. రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. – హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నాయిని రాజేందర్‌రెడ్డి,
భూమి కేటాయించకుండా రాష్ట్రం జాప్యం:
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఆరునెలలలో ల్యాండ్ అప్పగించాలని కేంద్రం అడిగింది..రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలేదు. పీవోహెచ్ కోసం 160 ఎకరాల్లో 2 ఎకరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అభివృద్ధి గురించి ఆలోచన లేదు కానీ ప్రతిసారి అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడుతారు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం. -రావు పద్మ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు