TTD | తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..! వెంకన్న కానుకలను ఈ-వేలంలో పొందండిలా..?
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామికి కానుకగా సమర్పించిన కానుకలను వేలం వేయనున్నట్లు ప్రకటించింది

TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామికి కానుకగా సమర్పించిన కానుకలను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ-వేలంలో ఎవరైనా భక్తులు పాల్గొని.. కానుకలను తమ సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఇందులో చాలా మంది భక్తులు తమకు నచ్చిన కానుకలను హుండీలో వేస్తుంటారు. అలాగే, పలువురు భక్తులు నిలువుదోపిడీ సమర్పిస్తుంటారు. ఇలా భక్తులు సమర్పించిన కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించనుంది. ఈ నెల 13న ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా వేలం వేయనున్నట్లు పేర్కొంది. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్‌లను మార్చి 13న జరిగే వేలంలో ఉంచినట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను టీటీడీ ఈ-వేలంలో వేయనుంది.
టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో లాంటి పెద్ద కంపెనీ వాచీలతోపాటు ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్‌సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల సెల్‌ఫోన్లు ఉన్నాయి. ఇందులో కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న 23 లాట్స్ వాచీలు, 27 లాట్లు సెల్‌ఫోన్లు ఈ-వేలంలో ఉంచనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చని టీటీడీ పేర్కొంది. భక్తులు అధికరిక వెబ్‌సైట్ tirumala.org, పోర్టల్ konugolu.ap.gov.inని సంప్రదించవచ్చని పేర్కొంది. శ్రీవారికి వచ్చిన కానుకలను కూడా భక్తితో స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ-వేలంలో పాల్గొని టీటీడీ అందిస్తున్న సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.