Warangal | ఒక్క సభ రెండు లక్ష్యాలు.. BRS ప్లీనరీల తీరు

BRS కమల దళంపై విమర్శలు.. గులాబీ దండుపై పొగడ్తలు కేడర్ కు ఎన్నికల దిశానిర్దేశం.. రూ.2 కోట్లతో భరోసా నిధి సభలకు అధికార హంగు.. ప్లీనరీలో ఘుమఘుమలు ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యేలు ఓరుగల్లు గులాబీమయం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక్క సభ రెండు లక్ష్యాలు సాధన దిశగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశాలు కొనసాగాయి. అధికార హంగు విందు భోజన పసందుతో ప్లీనరీలు ఉదయం నుంచి సాయంత్రం […]

Warangal | ఒక్క సభ రెండు లక్ష్యాలు.. BRS ప్లీనరీల తీరు

BRS

  • కమల దళంపై విమర్శలు.. గులాబీ దండుపై పొగడ్తలు
  • కేడర్ కు ఎన్నికల దిశానిర్దేశం.. రూ.2 కోట్లతో భరోసా నిధి
  • సభలకు అధికార హంగు.. ప్లీనరీలో ఘుమఘుమలు
  • ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యేలు
  • ఓరుగల్లు గులాబీమయం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక్క సభ రెండు లక్ష్యాలు సాధన దిశగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశాలు కొనసాగాయి. అధికార హంగు విందు భోజన పసందుతో ప్లీనరీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గులాబీ నాయకులు, కార్యకర్తల హంగామా మధ్య నిర్వహించారు. ప్రధాన సెంటర్లను గులాబీ తోరణాలతో రంగుల మయం చేశారు. పండుగ వాతావరణంలో ప్లీనరీలను ఆర్భాటంగా నిర్వహించారు.

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పులలో జరిగిన ప్లీనరీలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ములుగులో జరిగిన ప్లీనరీలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మడికొండలో జరిగిన వరంగల్ పశ్చిమ ప్లీనరీలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రసంగించారు. నర్సంపేటలో జరిగిన ప్లీనరీలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌లో జరిగిన తూర్పు నియోజకవర్గ ప్లీనరీలో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాల్ పల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్ ఘన్పూర్ లో డాక్టర్ రాజయ్య, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్ లో డీఎస్ రెడ్యానాయకులు పాల్గొన్నారు.

ఈ ప్లీనరీ సమావేశాలకు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు స్థానికంగా హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి,
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.

గులాబీ పాలనకు పొగడ్తలు

రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారం చేపట్టిన గులాబీ దండు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పొగడ్తలు కురిపించారు. కేసీఆర్ పాలనను ఆకాశానికి ఎత్తుతూ దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారంటూ రానున్న కాలంలో తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందంటూ అభినందనలు, ప్రశంసలతో ప్లీనరీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలతో ముంచెత్తారు.

రాష్ట్ర సర్కారుకు సానుకూల తీర్మానాలు

హైద‌రాబాద్‌లో డాక్టర్ బి.ఆర్‌.అంబేద్క‌ర్ 125 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసినందుకు,
రాష్ట్ర స‌చివాల‌యానికి డాక్టర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ పేరు పెట్టినందుకు, హైద‌రాబాద్ లో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు నిర్మించినందుకు, ఎస్టీల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించినందుకు, ఎస్సీల‌కు ద‌ళిత బంధు అందించినందుకు, కొత్త జిల్లాలు, మండ‌లాలు, పంచాయ‌తీలు ఏర్పాటు చేసినందుకు, ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నందుకు, ధాన్యాన్ని గిట్టుబాటు ధ‌ర‌తో కొనుగోలు చేస్తున్నందుకు, పంట న‌ష్టాల‌కు ప‌రిహారంగా ఎక‌రాకు 10వేల రూపాయ‌లు ఇస్తున్నందుకు సిఎం కెసిఆర్‌ కు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తూ తీర్మానించారు.

కమల దళంపై తిట్ల దండకం

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలన లక్ష్యంగా ప్లీనరీలో తిట్ల దండకాన్ని కొనసాగించారు. రాష్ట్రానికి మోడీ చేస్తున్న అన్యాయం పై విరుచుకబడ్డారు. విభజన హక్కుల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బిజెపి లక్ష్యంగా ప్రసంగాలు తీర్మానాలు కొనసాగాయి.

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ గారి పేరు పెట్టాలని, బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టాలని, ఉపాధి హామీ నిధులకు కేంద్రం కోత విధించింది. అలాగే ఉపాధి హామీని వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేయాలని, సింగ‌రేణిని ప్రైవేట్ ప‌రం చేయ‌వ‌ద్దని, సింగ‌రేణిలో వేలం పాట‌లు ఆపాలని, సింగ‌రేణిని గుజ‌రాత్ గ్లానైట్ గ‌నుల లాగే తెలంగాణ‌కు అప్ప‌గించాలని, కార్మికుల పొట్ట కొట్ట‌వ‌ద్దని, వంట‌ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాలని విభ‌జన హామీలైన బ‌య్యారం ఉక్కు, బ‌య్యారంలో వెంట‌నే ఉక్కు ఫ్యాక్ట‌రీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, ములుగులో గిరిజ‌న యూనివర్సిటీ,కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిష‌న్ భ‌గీర‌థ‌కు నిధులు విడుద‌ల, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ‌ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. దేశంలో మ‌త చిచ్చు పెట్టి, ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే బిజెపి ప్ర‌భుత్వాన్ని వెంట‌నే గ‌ద్దె దించాలని పిలుపునిచ్చారు.

కేడర్ కు ఎన్నికల దిశానిర్దేశం

రానున్న ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కేడర్ కు ఈ ప్లీనరీల సాక్షిగా దిశానిర్దేశాన్ని చేశారు. అటు బిజెపి పై విమర్శలను ఇటు టిఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో చర్చ పెట్టాలంటూ కర్తవ్య బోధ చేశారు. ఒక విధంగా రానున్న ఎన్నికలకు పది నెలల ముందుగానే రాజకీయ శంఖారావాన్ని పూరించారు. సాంస్కృతిక ప్రదర్శనలతో సభికులను ఆకర్షించారు.

రూ.2 కోట్లతో భరోసా నిధి.

నర్సంపేట ప్లీనరీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం భరోసా నిధిని రూ.2 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెల జీతం కార్యకర్తల భరోసా నిధికి విరాళంగా ఇస్తున్నట్లు పెద్ది ప్రకటించారు.

ప్లీనరీలో ఘుమఘుమలు

ప్లీనరీలలో కేడర్ కు విందు భోజనాలు సమకూర్చారు. ప్లీనరీ ప్రాంగణాలు ఘుమఘుమలు వెదజల్లాయి. చికెన్ కరీ, చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ, ఫిష్ కరీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కరీతో పాటు మరో ఐదు రకాల వెజ్ ఐటమ్స్ తో పసందైన వంటకాలతో విందు భోజనం. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, వెజ్ బిర్యానీ, పాయ సూప్, బోటి ఫ్రై, ఆలు కుర్మా, ఆకు కూర పప్పు, టమాటా-ఆలూ, దోసకాయ చట్నీ, సాంబారు, రైత, ఐస్, క్రీమ్, మజ్జిగ అందించారు. నర్సంపేటలో 10 రకాలు, మహబూబాబాద్‌లో 20 రకాలు, తూర్పులో 32 రకరకాల వంటలతో శ్రేణులకు విందుభోజనం అందించారు.