‘తమ్ముడూ’ అంటూ.. కైకాల తోడబుట్టినవాడిలా ఆదరించారు: చిరంజీవి
విధాత: కైకాల సత్యన్నారాయణ స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కైకాల మృతికి ఆయన ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి షేర్ చేసుకున్నారు. చిరంజీవి తన ట్వీట్‌లో ‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణగారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణగారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ […]

విధాత: కైకాల సత్యన్నారాయణ స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కైకాల మృతికి ఆయన ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి షేర్ చేసుకున్నారు. చిరంజీవి తన ట్వీట్‌లో
‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యన్నారాయణగారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణగారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా.. భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.
శ్రీ కైకాల సత్యన్నారాయణగారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది.
గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణగారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఎంతో ఇష్టపడే వారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో ‘‘అమ్మా ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు ‘‘మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో సంతోషపడిపోయారు.
శ్రీ కైకాల సత్యన్నారాయణగారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను – కె. చిరంజీవి’’ అని పేర్కొన్నారు.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu