సంచార జాతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి: నరసింహ
విధాత, మెదక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచార జాతుల సంక్షేమం, అలాగే వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర్క నరసింహ కోరారు. జిల్లాలో డీనోటి ఫైడ్, సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన నరసింహ గురువారం కలెక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో సంక్షేమ అధికారులు, అటవీ, మైన్స్, విద్యా శాఖ అధికారులు, […]

విధాత, మెదక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచార జాతుల సంక్షేమం, అలాగే వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దక్షిణ భారత అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యుడు తుర్క నరసింహ కోరారు.
జిల్లాలో డీనోటి ఫైడ్, సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన నరసింహ గురువారం కలెక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో సంక్షేమ అధికారులు, అటవీ, మైన్స్, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ వాటి పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు చేసిందని అన్నారు. అంతకుముందు జ్యోతిబా పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల భారత దేశ చరిత్రలో ఇప్పటికీ సమాజంలో అణగారిన ఎస్సి, ఎస్టీ, బి.సి. వర్గాలలోని పలు ఉప కులాల వారిని చిన్నచూపు చూస్తున్నారని, రాజ్యాంగ ఫలాలు అందడం లేదని గుర్తించిన కేంద్ర, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తుందన్నారు.
జిల్లాలో ఏయే ప్రాంతాల్లో సంచార జాతుల వారు నివసిస్తున్నారో గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వృత్తి నైపుణ్యాభివృద్ధి, తదితర రంగాలలో ఆర్థికంగా బలోపేతం చేయడానికి జాతీయ ఎస్సి ఆర్థిక అభివృద్ధి సంస్థ నిధులు అందిస్తున్నదని వాటిని సద్వినియోగపర్చుకునేలా కార్యక్రమాలు రూపొందించవలసినదిగా సూచించారు.
ప్రతి మండలంలోని గ్రామం వారీగా డి అండ్ సి క్యాటగిరీలలో ఉన్న జనాభా వివరాల జాబితా అందించవలసినదిగా బి.సి. అభివృద్ధి అధికారికి, ఎస్సి అభివృద్ధి శాఖ ద్వారా లబ్ది చేకూర్చిన వివరాల జాబితా అందజేయవలసినదిగా ఎస్సి అభివృద్ధి అధికారులకు సూచించారు. సంచార జాతుల వారికి సామాజిక న్యాయం చేకూరేలా మానవత్వంతో పనిచేయాలని సూచించారు.
ఏ వ్యవస్థ బాగుండాలన్న విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, అప్పుడే మానవ విలువలు బాగుంటాయని, లేకుంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని నరసింహ అన్నారు. సమాజ నిర్మాత ప్రదాతలు ఉపాధ్యాయులేనని విద్యార్థులకు పాఠ్య అంశాలను చక్కటి కాన్సెప్ట్ తో అర్థమయ్యేలా చెప్పి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దేలా చూడాలని సూచించారు. నేడు విద్యా వ్యవస్థ బలహీనంగా ఉందని, లోపాలను గుర్తించి పటిష్ఠపరచాలని అందుకు సబ్జెక్టు వారీగా సిలబస్ లో మార్పులు, చేర్పులపై సూచనలు ఇవ్వవలసినదిగా ఉపాధ్యాయులను కోరారు.
ఒక్కప్పుడు తక్షశిల, నలంద, నాగార్జున వంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి జ్ఞాన బిక్ష పెట్టామని, అదే స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. అటల్ బిహారీ టింకర్ యోజన క్రింద పాఠశాలలో ల్యాబ్ ల ఏర్పాటుకు 10 లక్షల వరకు సహాయం పొందవచ్చని, కావలసిన పాఠశాలలు నివేదికలు ఇవ్వవలసినదిగా సూచించారు.
జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా, నమోదైన కేసులలో నష్టపరిహారం చెల్లించి నట్లయితే సమగ్ర నివేదికను అందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాలు చేసిన వారిలో సంచార జాతుల వారిని గుర్తించి వివరాలు అందజేయాలని, అదేవిధంగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నేర ప్రవృత్తిని తగ్గించాలని, వారికి పునరావాసం కల్పించాలని తెలిపారు.
సమావేశంలో ఆర్.డి.ఓ. సాయి రామ్, డిఎస్పీ సైదులు, ఎస్సి, ఎస్టీ, బి.సి., మైనారిటీ అధికారులు విజయలక్ష్మి, కేశూరం, జెంలా నాయక్, మైన్స్ ఏ.డి. జయరాజ్, డి.ఎఫ్.ఓ. రవి ప్రసాద్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, వివిధ పాఠశాలల నుండి 30 అంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.