France | యువకుడి హత్య.. లూటీలు, దహనాలతో రగులుతున్న ఫ్రాన్స్
మూడు రోజులుగా రణరంగం 40వేల మంది పోలీసుల మోహరింపు పారిస్: ట్రాఫిక్‌లో కారు ఆపలేదన్న కారణంతో ఓ యువకుడిని పోలీసులు కాల్చి చంపడంపై చెలరేగిన ఆందోళనలు.. హింసాత్మక రూపు దాల్చాయి. దీంతో గత మూడు రోజులుగా పారిస్ (France) నగరం రణరంగాన్ని తలపిస్తున్నది. ఎటు చూసినా దహనమవుతున్న కార్లు, బ్యాంకు లూటీలతో అరాచకం రాజ్యమేలుతున్నది. అనేక చోట్ల పలు దుకాణాల్లో చొరబడిన ఆందోళనకారులు వాటినీ లూటీ చేశారు. గురువారం ఒక్కరోజే 667 మందిని అరెస్టు చేసినట్టు అంతర్గత […]

- మూడు రోజులుగా రణరంగం
- 40వేల మంది పోలీసుల మోహరింపు
పారిస్: ట్రాఫిక్‌లో కారు ఆపలేదన్న కారణంతో ఓ యువకుడిని పోలీసులు కాల్చి చంపడంపై చెలరేగిన ఆందోళనలు.. హింసాత్మక రూపు దాల్చాయి. దీంతో గత మూడు రోజులుగా పారిస్ (France) నగరం రణరంగాన్ని తలపిస్తున్నది. ఎటు చూసినా దహనమవుతున్న కార్లు, బ్యాంకు లూటీలతో అరాచకం రాజ్యమేలుతున్నది. అనేక చోట్ల పలు దుకాణాల్లో చొరబడిన ఆందోళనకారులు వాటినీ లూటీ చేశారు.
గురువారం ఒక్కరోజే 667 మందిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గెరాల్డ్ డార్మనిన్ చెప్పారు. నాహెల్ ఎం అనే 17 ఏండ్ల అల్జీరియన్-మొరాకన్ యువకుడి హత్యతో ఈ ఘర్షణలు చెలరేగాయి. నేరుగా ఛాతీపై కాల్పలు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు కారకుడైన పోలీసుపై హత్య అభియోగాలతో ప్రాథమిక దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. విచారణ కాలంలో ఆయన ముందస్తు నిర్బంధంలో ఉంటారని తెలిపారు.
మార్సెల్లి, లైయాన్, పావు, టౌలోజ్, లిల్లీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఉత్తర పారిస్‌లోని ఒక బస్ డిపో, లైయాన్ తూర్పు ప్రాంతంలో మెట్రోను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. టౌలోజ్‌లో ఒక క్రేన్‌కు, అబర్‌విల్లియర్స్‌లో బస్ డిపోకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సెంట్రల్ పారిస్‌లో నైక్ షూ షోరూం గేట్లు బద్దలు కొట్టి, దోచుకున్న ఘటనలో 14 మందిని అరెస్టు చేశారు.
ఫ్రాన్స్‌లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు 40 వేల మంది పోలీసులను మోహరించారు. బుధవారంతో పోల్చితే పోలీసుల సంఖ్య నాలుగింతలు చేశారు. పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగిన యువకులపై బాష్పవాయువు ప్రయోగించారు. పలు నగరాల్లో ‘నాహెల్ కోసం ప్రతీకారం’ అంటూ ఆందోళనకారులు పోస్టర్లు వేశారు. ఇదిలా ఉంటే నాహల్‌ను చంపిన పోలీసు అధికారి బాధిత కుటుంబాన్ని క్షమాపణ కోరాడని అతడి తరఫు న్యాయవాది తెలిపారు. కాళ్లపై కాల్చాలనుకున్నా.. అది గురితప్పి ఛాతీలోకి వెళ్లిపోయిందని పోలీసు అధికారి చెబుతున్నారు.