‘గవరల’ మద్దతు జగన్‌కు దక్కేనా!

విధాత‌: రాజకీయ నాయకులు ఏ అడుగు వేసినా దానికి ఎన్నికలు.. ఓట్లు ఇతరత్రా ప్రయోజనాలతో అంతర్లీనంగా ముడి పది ఉంటుంది. ఆ ప్రయోజనం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళరు. రానున్న ఎన్నికల సమీకరణాలు నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మద్దతు ఎవరు సాధిస్తే వాళ్ళకే విజయావకాశాలు ఉంటాయి. కులాలవారీగా.. మతాల వారీగా ఓట్లను పోగేసుకుని ఆ కుప్ప మీద ముఖ్యమంత్రి కుర్చీ వేసుకోవాలన్నది నాయకుల ప్లాన్. తాజాగా జగన్ కూడా అదే పనిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో కీలకమైన […]

  • By: krs    latest    Jan 06, 2023 8:40 AM IST
‘గవరల’ మద్దతు జగన్‌కు దక్కేనా!

విధాత‌: రాజకీయ నాయకులు ఏ అడుగు వేసినా దానికి ఎన్నికలు.. ఓట్లు ఇతరత్రా ప్రయోజనాలతో అంతర్లీనంగా ముడి పది ఉంటుంది. ఆ ప్రయోజనం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళరు. రానున్న ఎన్నికల సమీకరణాలు నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మద్దతు ఎవరు సాధిస్తే వాళ్ళకే విజయావకాశాలు ఉంటాయి.

కులాలవారీగా.. మతాల వారీగా ఓట్లను పోగేసుకుని ఆ కుప్ప మీద ముఖ్యమంత్రి కుర్చీ వేసుకోవాలన్నది నాయకుల ప్లాన్. తాజాగా జగన్ కూడా అదే పనిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో కీలకమైన గవర కులస్థులను మంచి చేసుకుని వారి మద్దతు పొందేందుకు అన్ని మార్గాలూ చూస్తున్నారు.

గవరలు గతంలో కాంగ్రెస్ వైపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఆ వైపుగా కదిలారు. 1983 నుంచి చూసుకుంటే టీడీపీకే వారి సపోర్ట్ దక్కుతూ వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు ఆరేడు
అసెంబ్లీ సీట్ల‌తోబాటు అనకాపల్లి ఎంపీ సీట్ సైతం గవరల ప్రాబల్యం ఉంటుంది

టిడిపి హయాంలో దాడి వీరభద్రరావు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ తరఫున కొణతాల రామకృష్ణకు అవకాశాలు దక్కాయి. వైసీపీ నుంచి కూడా అనకాపల్లి ఎంపీగా భీశెట్టి సత్యవతి గెలిచారు. అయితే తమకు పట్టున్న అనకాపల్లి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లతో పాటు ఎలమంచిలి మాడుగుల విశాఖ పశ్చిమ సీట్లను గవరలు కోరుతున్నారని అంటున్నారు.

దీని మీద వైసీపీ ఏమాలోచిస్తోందో తెలియడం లేదు అని అంటున్నారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి గుడివాడ అమరనాథ్‌ (కాపు) ఉన్నారు. ఆయనకు కాకుండా వచ్చే ఎన్నికల్లో లోకల్ అయిన గవరలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర సామాజికవర్గానికి చెందిన ఆంధ్రా కురియన్ గా పేరుపొందిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మరణం సందర్భంగా ఎలమంచిలిలో ఉన్న ఆయన నివాసానికి వచ్చి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆడారి డెయిరీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు.

ఆడారి తులసీరావు రాజకీయంగా ఎప్పుడూ పదవులు చేపట్టలేదు. కానీ వేలాదిమంది పాడి రైతులు వందలాది సహకార సంఘాలు ఆయన చేతిలో ఉన్నందున ఆయన ఏ పార్టీకి మద్దతుగా ఉంటే ఆ పార్టీ అభ్యర్ధులు గెలుపు ఖాయమని అంటారు.

ఆ విధంగా ఆడారి తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల కాలం పాటు గట్టి మద్దతుదారుగా తెర వెనక ఉంటూ వచ్చారు. ఆయన కుటుంబం 2019 ఎన్నికల తరువాత వైసీపీలోకి వచ్చింది. కుమార్తె రమాదేవి ఎలమంచిలి మునిసిపల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. కుమారుడు ఆనంద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ స్వయంగా వచ్చి ఆడారి భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించడం ద్వారా బలమైన గవర సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు బీసీలకు కేటాయించాలని చూస్తున్న వైసీపీ గవర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విశాఖ గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశాన్ని దెబ్బ తీయాలని చూస్తోంది. ఆడారికి సీఎం వచ్చి నివాళి అర్పించడం పట్ల మాత్రం ఆ సామాజిక వర్గంలో సానుకూలత వ్యక్తం అవుతోంది.