ఏం పీక్కుంటారో పీక్కోండి.. వైసీపీపై నిప్పులుచెరిగిన వైఎస్ షర్మిల
‘ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఏం పీక్కుంటారో పీక్కోండి.. అంటూ వైసీపీ నేతలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ సవాల్

– ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు..
– ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా
– ప్రత్యేక హోదా, పోలవరం వచ్చే వరకు ఇక్కడ నుంచి కదల..
– నా మీద స్టోరీలు అల్లుతున్నారు.. రోజుకో జోకర్ ను తెస్తున్నారు
– ‘సాక్షి’ సంస్థలో నాకూ భాగం ఉంది
– ప్రజలను పట్టించుకోని జగన్.. వైఎస్సార్ వారసుడా?
విధాత: ‘ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఏం పీక్కుంటారో పీక్కోండి.. ఎలా నిందలు వేస్తారో వేయండి’ అంటూ వైసీపీ నేతలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ సవాల్ చేశారు. ప్రత్యేక హోదా.. పోలవరం వచ్చే వరకూ ఇక్కడ నుంచి కదల అంటూ భీష్మించారు. సోమవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన షర్మిల.. వైసీపీపై మాటల తూటాలు పేల్చారు. జగన్ కుటుంబంతో పాటు వైసీపీ నేతలపై సవాళ్లు.. నిలదీతలు.. ప్రశ్నలు సంధిస్తూ ఆద్యంతం ఆమె భగ్గుమన్నారు. మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్.. ఆయన పథకాలే ఒక మార్క్ అంటూ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. రోజుకో జోకర్ ను తెస్తున్నారు… నాపై నిందలు వేపిస్తున్నారు అని చెప్పిన షర్మిల… ‘సాక్షి’ సంస్థలో తనకూ సగ భాగం ఉందని పేర్కొన్నారు. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి నే. నాన్న రక్తమే నాలో ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి…ఈ కడప బిడ్డ. పులివెందుల పులి అని షర్మిల అన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే కడప జిల్లాకు కడప స్టీల్, కడప-బెంగళూర్ రైల్వే లైన్ వచ్చేవని చెప్పారు.
– వైఎస్సార్ ఆశయాలు జగన్ అన్న నిలబెడుతున్నరా?
వైఎస్సార్ తన జీవితంలో బీజేపీని ఎప్పటికీ వ్యతిరేకించారు..అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ అన్న నిలబెడుతున్నరా? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ మైనారిటీలను ప్రేమించే వారని, ఇప్పుడు జగన్ ఆన్న మైనారిటీలపై బీజేపీ దాడులు చేస్తుంటే స్పందించడం లేదంటూ విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్ ను నిలదీశారు. బీజేపీని అడిగే దమ్ములేదు… నిలదీసే దమ్ము కూడా లేదన్నారు. పోలవరం అడిగే సత్తా లేదు… హోదా కోసం కొట్లాడే పరిస్థితి లేదని చెప్పారు. దేశంలో బీజేపీ వేరే అర్థం ఉంటే… ఇక్కడ మాత్రం బాబు, జగన్, పవన్.. అంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో మన జాతకాలు మారాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
– జగన్ ఆన్న లాగే నేను ఇక్కడే పుట్టా
కడప నా పుట్టిన ఇల్లు… జగన్ ఆన్న లాగే నేను ఇక్కడే పుట్టా, జమ్మలమడుగు ఆసుపత్రిలో నేను పుట్టానని వైఎస్ షర్మిల అన్నారు. ‘జగన్ ఆన్నకి నేను వ్యతిరేకి కాదు, జగన్ అన్నది రక్తమే.. కానీ జగన్ అన్న అప్పటి మనిషి కాదు.. ఇప్పటి జగన్ అన్నను ఎప్పుడు చూడలేదు’ అని అన్నారు. జగన్ అన్న క్యాడర్ కి, పార్టీకి నేను చేసిన సేవలు గుర్తుకు లేవు అంటూనే.. తన మీద స్టోరీలు అల్లుతున్నారు.. రోజుకో జోకర్ ను తెస్తున్నారు.. నా మీద బురద చల్లుతున్నారు అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. నిన్న ఒక జోకర్ తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట.. జగన్ జైల్లో ఉన్నప్పుడు తన భర్త అనిల్ సోనియాను కలిశారట. జగన్ ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట. ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు. ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు.. మీ కుట్రలకు అంతే లేదా? అంటూ షర్మిల ప్రశ్నించారు.
– నాకు పదవీ ఆకాంక్ష లేదు..
తనకు పదవీ ఆకాంక్ష ఉంటే… నాన్నను అడిగి తీసుకోనా? వైసీపీ లోనైనా పదవి తీసుకోనా? పదవీ ఆకాంక్ష ఉంటే… మీకోసం నేను ఎందుకు మాట్లాడుత? అంటూ వైసీపీ నేతల వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. అనిల్, భారతి రెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్ళారు.. భారతికి తెలియకుండా సోనియాను అడిగారా? భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా? కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదు అంటూ షర్మిల తోసిపుచ్చారు. తెలంగాణలో తనతో కలిసి పని చేసిన వాళ్లకు ‘సాక్షి’ సంస్థ నుంచి ఫోన్లు వస్తున్నాయ్.. నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు అంటూ ఆరోపించారు. ఇదే సాక్షి సంస్థలో తనకు భాగం ఉందని, వైఎస్సార్ సగం భాగం ఇచ్చారు.. సగం భాగం ఉన్న తనపై నా సంస్థ బురద చల్లుతోంది అంటూ ఆవేదన చెందారు. ‘నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్న. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్న. విలువలు, విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు’ అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఎవరెంత నిందలు వేసినా… నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చా. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడ నుంచి కదల.. పోలవరం వచ్చే వరకు కదల… ఏం పీక్కుంటారో… పీక్కోండి అంటూ షర్మిల సవాల్ విసిరారు.