ఉత్తరాఖండ్‌లో సొరంగం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది సేఫ్?
ఉత్తరాఖండ్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మంగళవారం భారీ డయామీటర్ పైపులు డ్రిల్లింగ్ యంత్రాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి.

- మూడో రోజు కూడా కొనసాగుతున్నసహాయక చర్యలు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మంగళవారం భారీ డయామీటర్ పైపులు డ్రిల్లింగ్ యంత్రాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఆదివారం ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగంలో కొంత భాగం అకస్మాత్తుగా కూలిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ ఘటనలో దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి.
ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లీమీటర్ల వ్యాసం పైపులతో కూడిన ట్రక్కులు సిల్కీయారాకు రావడం ప్రారంభించాయి. తాజాగా భారీ డ్రిల్లింగ్ మిషన్ కూడా చేరుకోవడంతో సహాయక చర్యలు మరింత వేగవంతంగా జరగడం ప్రారంభించాయి. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు వీలుగా శిధిలాల మధ్య పెద్ద వ్యాసం కలిగిన ఎమ్మెస్ పైపులను చొప్పించడానికి ఒక యంత్రాన్ని కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
చిక్కుకున్న 40 మంది కార్మికుల ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాల్సి ఉందని సాయక బృందాలు తెలిపాయి. కాగా ఈ సహాయక చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.
సహాయక చర్యల కోసం హరిద్వార్ డెహ్రాడూన్ నుంచి పెద్ద డయామీటర్ హ్యూమన్ పైపులను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ధామి తెలిపారు. ఈ ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులు యోగక్షేమాల గురించి తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేశారని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 60 మీటర్ల శిధిలాలలో 20 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించామని ఈరోజు రాత్రి వరకు లోపల చిక్కుకున్న 40 మందిని బయటకు తీస్తామని ఉత్తరకాశి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అర్బన్ యదువంశీ చెప్పారు. వారికి ఆక్సిజన్ ఆహారము నీరుతో సహా అన్ని మౌలిక సదుపాయాలను పైపుల ద్వారా కల్పిస్తున్నారని వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని తెలిపారు.