రేపిస్టుకు ఓట్లడిగినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి

రేపిస్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణవంటివారికి ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికారని, ఆయనకు ఓట్లు వేయాలని కోరినందుకు ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు.

రేపిస్టుకు ఓట్లడిగినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి

ప్రజ్వల్‌ ఏం చేశాడో మోదీకి తెలుసు
అధికారం కోసం బీజేపీ నేతలు ఏదైనా చేస్తారు: రాహుల్ గాంధీ

శివమొగ్గ: రేపిస్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణవంటివారికి ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికారని, ఆయనకు ఓట్లు వేయాలని కోరినందుకు ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ‘ఇక్కడ అతిపెద్ద అంశం రేవణ్ణ కేసు. 400 మంది మహిళలను రేప్‌ చేశాడు. ఆయనకు మోదీ మద్దతు పలికారు. ఇందుకు మొదట ప్రధాని జవాబు చెప్పాలి. మహిళలకు క్షమాపణ చెప్పాలి’ అని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు.

కర్ణాటకలోని శివమొగ్గలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. ‘ఈ దేశ తల్లులు, చెల్లెళ్లకు కూడా క్షమాపణ చెప్పాలి. 400 మందిని ప్రజ్వల్‌ రేవణ్ణ రేప్‌ చేశాడు. వాటిని వీడియోల్లో చిత్రీకరించాడు. ఇది సెక్స్‌ స్కాండల్‌ కాదు.. మూకుమ్మడి లైంగికదాడులు’ అని చెప్పారు. కర్ణాటక ప్రజల ముందు ఆ మూకుమ్మడి లైంగికదాడుల మనిషిని ప్రధాని సమర్థించారు. ఈ రేపిస్టుకు మీరు ఓటు వేస్తే అది తనకు సహాయం అవుతుందన్నారు’ అని ఆరోపించారు.

ప్రధాన మంత్రి ప్రజ్వల్‌ కోసం ఓటు అడిగినప్పుడు ఆయన ఏం చేశాడా కూడా ప్రధానికి తెలుసన్న విషయాన్ని కర్ణాటక గుర్తించాలి’ అని రాహుల్‌ చెప్పారు. ప్రజ్వల్‌ మాస్‌ రేపిస్టని ప్రతి బీజేపీ నాయకుడికీ తెలుసు. అయినా.. వారు ఆయనకు మద్దతు పలికారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు’ అని రాహుల్ విమర్శించారు. ‘దేశంలో మహిళలందరినీ ప్రధాన మంత్రి అవమానించారు. దేశంలోని ప్రతి మహిళకు ప్రధాని, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ నాయకులు అందరూ క్షమాపణలు చెప్పాలి’ అని రాహుల్ డిమాండ్‌ చేశారు.

ఒక మాస్‌ రేపిస్టుకు ఓటేయాలని ప్రపంచంలో ఏ నాయకూడూ చెప్పరని అన్నారు. మాస్‌ రేపిస్టు కోసం ప్రధాని ఓట్లడిగారనేది ఇప్పుడు యావత్‌ ప్రపంచంలో వార్త అయింది. ఇదీ బీజేపీ సిద్ధాంతం. అధికారం కోసం ఏదైనా చూసేందుకు పొత్తులు పెట్టుకునేందుకు వారు సిద్ధంగా ఉంటారు’ అని ఆరోపించారు. ప్రజ్వల్‌కు చెందిన దాదాపు 3000 లైంగిక కార్యకలాపాల వీడియోలు లీకయిన వెంటనే ఆయన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పారిపోయాడు. ఆయనపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ఇమిగ్రేషన్‌ కేంద్రాలకు ఆయనపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది.