మూడు రాష్ట్రాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన

- ఎంపీలనూ బరిలో దింపిన కాషాయపార్టీ
విధాత: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాలను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ జాబితాను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
రాజస్థాన్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ తన తొలి జాబితాను 41 మంది పేర్లతో సోమవారం విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలను సైతం బరిలో దింపడం విశేషం. ఈ జాబితాను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. అక్టోబర్ 1న జరిగిన ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఎంపీలు రాజ్యవర్ధన్ రాథోడ్, దియా కుమారిలను కూడా అసెంబ్లీ బరిలో నిలిపారు. దీనిపై రాథోడ్ స్పందిస్తూ.. ఎంపీగా ఎలాగైతే పనిచేశానో ఎమ్మెల్యేగా కూడా అదే స్థాయిలో పనిచేయగలనని తనను నమ్మిన ప్రధాని మోదీకి, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున మార్పు రావాల్సి ఉన్నదని చెప్పారు.
64 పేర్లతో ఛత్తీస్‌గఢ్ లిస్ట్
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే 64 మంది పేర్లతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపీలైన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావ్, రేణుకా సింగ్, గోమతి సాయ్ తదితరులు ఉన్నారు. రమణ్ సింగ్‌ను తన సొంత నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావున్ నుంచి పోటీలో ఉంచింది. అరుణ్‌ను లోర్మీ నియోజకవర్గం నుంచి బరిలో ఉంచింది. కాగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలు నవంబర్-7 నిర్వహిస్తుండగా రెండవ దశ ఎన్నికలు నవంబర్-17 న జరగనున్నాయి. వీటి ఫలితాలు మాత్రం డిసెంబర్-3న విడుదల కానున్నాయి.
57 మందితో మధ్యప్రదేశ్ లిస్టు
మధ్యప్రదేశ్‌లో కూడా 57 మందితో కూడిన మెదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ధి నియోజకవర్గం నుంచి పోటి చేయనున్నారు. అక్కడి హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దాటియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా గోపాల్ భార్గవ రేహ్లీ నుంచి, విశ్వాస్ సారంగ్.. నారె నుంచి బరిలో ఉంటారు. తులసీరాం సిలవత్.. సన్వేర్ నుంచి పోటీ చేయనున్నారు.