India’s population । 2036 నాటికి భారత జనాభా ఎంతకు చేరుకుంటుందో తెలుసా? ప్రభుత్వ అంచనాలు విడుదల
భారతదేశ జనాభాపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రూపొందించిన భారత్‌లో మహిళలు, పురుషులు 2023 (‘Women and Men in India 2023’) అనే నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

India’s population । భారతదేశ జనాభాపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రూపొందించిన భారత్‌లో మహిళలు, పురుషులు 2023 (‘Women and Men in India 2023’) అనే నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121,08,54,977. 2011 ఫిబ్రవరిలో చివరిసారి జనాభా లెక్కల సేకరణ (census) నిర్వహించారు. 2021లో మరో విడత జన గణన చేపట్టాల్సి ఉన్నా.. కరోనా (covid) కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది. అయితే.. ఈలోపే కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో మహిళలు, పురుషుల పరిస్థితిపై సమగ్ర చిత్రాన్ని (comprehensive) ఆవిష్కరించేందుకు ఈ డ్యాక్యుమెంట్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు. దీనితోపాటు వివిధ అంశాలపై (wide range) సమగ్ర డాటాను ఈ నివేదిక అందిస్తున్నది. పురుషులు, మహిళల్లో వివిధ గ్రూపుల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకునేందుకు ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. ఈ నివేదిక ప్రకారం.. 2036 నాటికి భారతదేశ జనాభా 152 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. అప్పటికి మొత్తం జనాభాలో మహిళలు 48.8%గా ఉంటారని తెలిపింది. 2011లో ఇది 48.5శాతంగా ఉన్నది. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 952గా ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం ఇది 943గా ఉన్నది.
2036 నాటికి పదిహేనేళ్లలోపు (age of 15) వయస్కుల నిష్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నదని నివేదిక అంచనా వేసింది. సంతాన సాఫల్యత తగ్గుదల (declining fertility) దీనికి కారణమవ్వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 60, అంతకు మించిన వయసున్నవారు గత పాతికేళ్లలో పెరిగినట్టు నివేదిక పేర్కొన్నది.
అత్యధిక జనాభా కలిగిన దేశం హోదాను చైనా త్వరలో కోల్పోతుందని గత ఏడాది ఏప్రిల్‌లో ఐక్య రాజ్యసమితి (United Nations) పేర్కొన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలాఖరు నాటికి భారత జనాభా 142,57,75,850కు చేరే అవకాశం ఉన్నది, తద్వారా జనాభాలో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. గత నెలలో కూడా ప్రపంచ జనాభా సూచికలు 2024 అనే నివేదికలో 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు దాటిపోతుందని, తదుపరి 12 శాతం తగ్గుదల నమోదవుతుందని వెల్లడించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా (world’s most populous country) భారత్ శతాబ్దంపాటు కొనసాగుతుందని అంచనా వేసింది.