CV Ananda Bose | బెంగాల్‌ గవర్నర్‌పై లైంగిక ఆరోపణలు.. రెస్పాండైన రాజ్‌భవన్‌..!

CV Ananda Bose | పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం లోక్‌సభ ఎన్నికల వేళ పెను సంచలనంగా మారింది. రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేసే ఒక మహిళే ఈ ఆరోపణలు చేసింది. అయితే గవర్నర్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై రాజ్‌భవన్‌ స్పందించింది. తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్ ద్వారా ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

CV Ananda Bose | బెంగాల్‌ గవర్నర్‌పై లైంగిక ఆరోపణలు.. రెస్పాండైన రాజ్‌భవన్‌..!

CV Ananda Bose : పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం లోక్‌సభ ఎన్నికల వేళ పెను సంచలనంగా మారింది. రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేసే ఒక మహిళే ఈ ఆరోపణలు చేసింది. అయితే గవర్నర్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై రాజ్‌భవన్‌ స్పందించింది. తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్ ద్వారా ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

ఇద్దరు అసంతృప్త ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అసత్య కథనాలను ప్రచారం చేశారని, నిజమే గెలుస్తుందని వెస్ట్‌ బెంగాల్ రాజ్‌భవన్‌ ఎక్స్‌ వేదికగా స్పదించింది. సృష్టించిన కథనాలకు తాను భయపడనని, ఎవరైనా తననను కించపర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటే వాళ్లను దేవుడే చూసుకుంటాడని గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ పేర్కొన్నారు. అయితే బెంగాల్‌లో అవినీతికి, హింసకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఎవరూ నిలువరించలేరని ఆయన వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే గురు, శుక్ర వారాల్లో ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. బెంగాల్‌లో ప్రధాని పర్యటనకు ముందు అక్కడి గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. కాగా రాజ్‌భవన్‌లో తాత్కాలిక ఉద్యోగినిగా పనిచేస్తున్న ఒక మహిళ గవర్నర్‌ హౌజ్‌ ప్రాంగణంలోని పోలీస్‌పోస్టులో గవర్నర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పారు. దాంతో ఆమెను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ ఆమె.. ఉద్యోగం విషయంలో ప్రయోజనం చేకూరుస్తానని చెప్పి గవర్నర్‌ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ వార్త విని తాము షాక్‌కు గురయ్యామని పేర్కొంది. సందేశ్‌ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా మహిళను వేధించారని, గవర్నర్‌ పదవికి ఆయన అప్రతిష్ఠ తెచ్చారని విమర్శించింది.