పేదలు, ధనికుల మధ్య పోరాటం ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై కాంగ్రెస్ నేత సుప్రియ

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుత ఎన్నికలు ధనికులకు, పేదలకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటమని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ శ్రీనెత్ అన్నారు. మొదటిదశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆమె బుధవారం రాయ్‌పూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ధనికుల వైపు బీజేపీ నిలబడితే.. ఇక్కడి పేదల తరఫున కాంగ్రెస్ ఉన్నదని చెప్పారు. పేదలకు న్యాయం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను బీజేపీ రేవడి సంస్కృతిగా అభివర్ణిస్తుండటాన్ని ప్రస్తావించగా.. కాంగ్రెస్ పేద ప్రజలకు పంచితే అది రేవడి సంస్కృతి అయితే.. మరి అదానీ గ్రూపునకు బీజేపీ ఉచితంగా కల్పిస్తున్న సౌకర్యాలు, భూములు, పన్ను మినహాయింపులకు ఏం చెబుతారని ప్రశ్నించారు. తాము ఛత్తీస్‌గఢ్‌లోని 44 లక్షల కుటుంబాలకు విద్యుత్తు బిల్లును సగానికి తగ్గించామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించామని, రైతాంగానికి ఎంతో మేలు చేశామని తెలిపారు. ఎక్కడా లేని విధంగా ధాన్యానికి రేటు పెంచి ఇస్తున్నామని చెప్పారు.