ప్రధాని మోదీపై కమెడియన్‌ పోటీ వెనుక..

మోదీకి దీటుగా నేనున్నానంటూ ముందుకొచ్చాడు కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా. ఈ 29 ఏళ్ల యువకుడు మోదీ గొంతును అనుకరిస్తూ చేసే వీడియోలతో పాపులర్‌ అయ్యాడు.

ప్రధాని మోదీపై కమెడియన్‌ పోటీ వెనుక..

సూర‌త్ ఘటన పునరావృతం కావద్దనే
ప్రతి నియోజకవర్గంలో ఒక్కరైనా నిలబడాలి
దేశానికి ఆ సందేశం ఇచ్చేందుకే మోదీపై పోటీ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిందే
వైర్‌ వెబ్‌సైట్‌తో కమెడియన్‌ శ్యాం రంగీలా

జైపూర్‌: మోదీకి దీటుగా నేనున్నానంటూ ముందుకొచ్చాడు కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా. ఈ 29 ఏళ్ల యువకుడు మోదీ గొంతును అనుకరిస్తూ చేసే వీడియోలతో పాపులర్‌ అయ్యాడు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్రమోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఎందుకు ఆయన మోదీపై పోటీకి దిగాలనుకుంటున్నాడు? రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌.. ఒకప్పుడు మోదీ భక్తుడు.. కానీ.. ఇప్పుడు అదే మోదీపై పోటీకి దిగుతున్నాడు. వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పోటీకి కారణాలను వివరించారు. ఇటీవల సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందటం తనను ఆలోచనలో పడేసిందని శ్యామ్‌ రంగీలా తెలిపాడు. ఇండోర్‌లో కూడా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకున్నదని చెప్పాడు. ఎన్నికలు జరుగకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ.. కాంగ్రెస్‌ అభ్యర్థిని పార్టీలో చేర్చుకునే బదులు ప్రజాస్వామ్యం కోసం పోటీకి అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. అందుకే తాను వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ప్రధానిపై పోటీకి దిగడం ద్వారా కనీసం ఒక్క వ్యక్తి అయినా తన నామినేషన్‌ పత్రాన్ని ఉపసంహరించుకోడన్న సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వడానికే తాను పోటీచేస్తున్నానని చెప్పాడు. రెండు నుంచి 4 ఓట్లు వచ్చినా సరే.. ప్రతి స్థానంలోనూ కనీసం ఒక్కరైనా నామినేషన్‌ ఉపసంహరించుకోవకూడదనేది తన అభిప్రాయమని చెప్పాడు.

చేసే ప్రతి కామెడీ షోలో రాజకీయాలే ఎందుకు ప్రధానాంశంగా ఉంటాయన్న ప్రశ్నకు.. రాజకీయాలే ఇప్పుడు కామెడీ అయిపోయాయని శ్యాం రంగీలా వ్యాఖ్యానించాడు. రాజకీయాల వల్లే కమెడియన్లను నిషేధిస్తున్నారని, మరోవైపు రాజకీయాల్లో కామెడీకి కొరత లేదని వ్యాఖ్యానించాడు. ఎన్నికలకు నిధుల సంగతేంటన్న ప్రశ్నకు.. ‘అభి తో ఝోలాహై బస్‌.. ఉఠాకే చల్‌ దేంగే ఔర్‌ క్యా’.. (ఇప్పటికైతే సంచి ఉన్నది. పట్టుకుని రోడ్లపైకి వెళ్లటమేం ఇంకేముంది?) అన్నాడు. ఝోలా ఉఠాకే అనే మాట ప్రధాని పాపులర్‌ డైలాగ్‌ అన్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు మోదీ మద్దతుదారుగా ఉండి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్నకు.. తాను 2016 వరకు మోదీకి పెద్ద మద్దతుదారునని, 2014లో బీజేపీ తొలిసారి గెలిచినప్పుడు చాలా మందిలానే తాను కూడా గత కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి నుంచి కొంత మార్పు వస్తుందని ఆశించానని, ఆ సమయంలో తాను భక్తుడినని చెప్పాడు. తాను గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌కు ఎంపికైనప్పుడు ఎంతో ఆనందపడ్డానని, అందులో తాను మోదీ గొంతును అనుకరించిన వీడియో లీక్‌ అయి.. తెగ వైరలైందని చెప్పాడు.

అయితే.. ఈ ఎపిసోడ్‌ను టెలివిజన్‌ కంపెనీ ప్రసారం చేయలేదని, అందులో మోదీని అనుకరించిన తీరును జనం హర్షించరని పేర్కొన్నదని తెలిపాడు. దీనితో తాను హతాశుడినయ్యానని చెప్పారు. ‘నేను మోదీ మిమిక్రీ మాత్రమే చేస్తున్నారు. అదికూడా హాని చేయని హాస్యం. మరి ఎందుకని నా కామెడీని తొలగించారు? అని ఆ రోజు ఆలోచించాను’ అని శ్యాం రంగీలా తెలిపాడు. దేశంలో రాజకీయ కామెడీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు.. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదన్నాడు. ఇది ఇక్కడ పనిచేయదని అర్థమైన తర్వాత సొంతగా యూట్యూబ్‌ వీడియోలు చేయడం మొదలు పెట్టానని తెలిపాడు.

మే పదో తేదీన నలుగురైదుగురం వారణాసి వెళుతున్నామని, అక్కడ మరింత మంది కలుస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు. తాను వారణాసి నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన దగ్గర నుంచీ తనకు అనేక సందేశాలు వస్తున్నాయని, తన ఫోన్‌ నిరంతరం రింగ్‌ అవుతూనే ఉన్నదని చెప్పాడు. మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు.. మోదీ గొంతును అనుకరిస్తూ ‘బిల్‌కుల్‌’ అంటూ సమాధానం చెప్పాడు.