Pahalgam Attack | మీ మిలిటరీ అసమర్థత వల్లే పహల్గామ్ దాడి: పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ అఫ్రిదీ
పహల్గామ్లో ఉగ్రవాద దాడికి భారత సైన్యం చేతకాని తనమే కారణమని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆరోపించాడు. అసలు పాకిస్తాన్ పాత్ర ఉందనేందుకు ఆధారాలేంటని నిలదీశాడు.

Pahalgam Attack | కశ్మీర్‌లోని పహల్గామ్లో చోటు చేసుకున్న మారణకాండ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనకు భారత ఆర్మీ చేతగాని తనమేనని మండిపడ్డాడు. పాకిస్తాన్‌కు చెందిన సామా టీవీతో మాట్లాడిన అఫ్రిదీ.. ఆ దేశంలో ఏ భాగంలో పటాకులు పేలినా పాకిస్తాన్‌ను విమర్శించడం మొదలుపెడతారని అన్నాడు. దాదాపు ఎనిమిది లక్షల మంది సైనికులను అక్కడ మోహరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు.
అయినా కూడా వారి భూభాగంపై దాడి జరిగిందంటే దానికి ఆ దేశ సాయుధ బలగాలనే నిందించాలన్నాడు. అసమర్థ, చేతగాని భారత ఆర్మీ అంటూ తిట్టిపోశాడు. వారు వారి దేశానికి భద్రత కల్పించుకోలేక పోతున్నారని అన్నాడు. పహల్గామ్ దాడి విషయంలో భారత మీడియా కవరేజీపైనా అఫ్రిదీ దుమ్మెత్తిపోశాడు. దాడి జరిగిన గంట వ్యవధిలోనే భారత మీడియా బాలీవుడ్‌లా మారిపోవడం తనకు ఆశ్చర్యం కల్గించిందన్నాడు. అలాంటి యాక్షన్లు ఆపాలని అన్నాడు. పహల్గామ్‌పై దాడి విషయంలో పాకిస్తాన్ పాత్ర ఉందనేందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశాడు.