రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీకి తొలి విడుత ఎన్నిక‌లు నిన్న జ‌రిగిన విష‌యం తెలిసిందే. మొత్తం 90 స్థానాల‌కు గానూ తొలివిడుత‌లో 20 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల‌ను న‌క్స‌ల్స్ నిషేధించ‌డం, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన‌ప్ప‌టికీ 70 శాతానికి పైగానే పోలింగ్ కావ‌డం విశేషం. బ‌స్త‌ర్ డివిజ‌న్‌లోని ఏడు జిల్లాల ప‌రిధిలోని 126 గ్రామాల్లో స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారిగా ఆయా గ్రామాల్లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రాల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అయితే ఈఎన్నిక‌ల్లో తొలిసారిగా మాజీ మ‌హిళా మావోయిస్టు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నారాయ‌ణ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో సుమిత్ర సాహూ ఓటేసి, ప‌లువురికి ఆద‌ర్శంగా నిలిచారు. ఐదేండ్ల క్రితం ఆమె తుపాకీ ప‌ట్టి, అడ‌వుల్లో మావోయిస్టు పార్టీలో తిరిగింది. నారాయ‌ణ్‌పూర్ ప‌రిధిలోని అమ్‌దాయి ఏరియా క‌మిటీ క‌మాండ‌ర్‌గా ఆమె కొన‌సాగారు.

నారాయ‌ణ్‌పూర్ జిల్లాలోని క‌దేనార్ గ్రామానికి చెందిన సాహూ 2004లో విప్ల‌వ సాహిత్యానికి, ఆ పాట‌ల‌కు ఆక‌ర్షితురాలై మావోయిస్టుల పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత నారాయ‌ణ్‌పూర్ ప‌రిధిలో జ‌రిగే పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఆమె బ‌హిష్క‌రించారు. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొన‌కుండా అడ్డుకున్నారు. అయితే 2018 కంటే ముందు పోలీసులు జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో సాహూ స‌న్నిహితులు ఆరేడుగురు చ‌నిపోయారు. దీంతో తీవ్ర క‌ల‌త చెందిన‌ ఆమె మావోయిస్టు పార్టీని వీడి 2018, డిసెంబ‌ర్‌లో పోలీసుల‌కు స‌రెండ‌ర్ అయ్యారు. అనంత‌రం 2019లో పోలీసు ఫోర్స్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆమె కానిస్టేబుల్‌గా కొన‌సాగుతున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి ఓటేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సాహు తెలిపారు. తాను పోలీసు ఫోర్స్‌లో 2019లో చేరాన‌ని గుర్తు చేశారు.

Subbu

Subbu

Next Story