అంత‌ర్జాతీయ ట్రేడ్ జాత‌ర‌ షురూ.. 14 రోజులపాటు ఢిల్లీలో నిర్వ‌హ‌ణ‌

భార‌తదేశంలోనే అతిపెద్ద వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న (ట్రేడ్ ఫెయిర్)కు దేశ రాజ‌ధానిలో తెర‌లేచింది. మంళ‌వారం నుంచి ఈ నెల 27 వరకు జరిగే ఈ ఫెయిర్ మధ్యాహ్నం ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైంది

అంత‌ర్జాతీయ ట్రేడ్ జాత‌ర‌ షురూ.. 14 రోజులపాటు ఢిల్లీలో నిర్వ‌హ‌ణ‌

1980 నుంచి ఏటా ఈవెంట్ ఏర్పాటు

13 దేశాల‌ ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌

తొలి 5 రోజులు వ్యాపార‌స్థుల‌కే ప్ర‌వేశం

19 నుంచి సాధారణ ప్రజలకు ఎంట్రి



విధాత‌: భార‌తదేశంలోనే అతిపెద్ద వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న (ట్రేడ్ ఫెయిర్)కు దేశ రాజ‌ధానిలో తెర‌లేచింది. మంళ‌వారం నుంచి ఈ నెల 27 వరకు జరిగే ఈ ఫెయిర్ మధ్యాహ్నం ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) 42వ ఎడిషన్ వార్షిక ప్ర‌ద‌ర్శ‌న షురూ అయింది. రెండు వారాల‌పాటు జ‌రిగే ఈ ట్రేడ్ ఫెయిర్‌కు రోజూ 40,000 మందికిపైగా సంద‌ర్శించ‌నున్నారు. వారాంతాల్లో ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల మంది ప్రజలు సందర్శిస్తారని నిర్వాహ‌కులు తెలిపారు. ఈ ఏడాది నిర్వ‌హించే ప్ర‌ద‌ర్శ‌నను “వసుధైవ కుటుంబం – యునైటెడ్ బై ట్రేడ్” థీమ్‌తో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) అధికారులు నిర్వ‌హిస్తున్నారు.


“ఢిల్లీ, జ‌మ్ముక‌శ్మీర్‌, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఫెయిర్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, వియత్నాం, కిర్గిస్థాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్, ట్యునీషియా, ఒమన్, ఈజిప్ట్, టర్కీ, లెబనాన్ దేశాలు కూడా త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో చైనా, దక్షిణాఫ్రికా, కొరియా దేశాలు వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనలేదు” అని అధికారి తెలిపారు.


ఎగ్జిబిష‌న్‌కు మొదటి ఐదు రోజులు వ్యాపారుల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తారు. వీరి టికెట్ రూ.500గా నిర్ణ‌యించారు. నవంబర్ 19 నుంచి సాధారణ ప్రజలకు ప్ర‌వేశం ఉంటుంది. వీరికి సాధార‌ణ రోజుల్లో ప్ర‌వేశ టికెట్ ధ‌ర రూ.80గా, వారాంతాల్లో రూ.150గా నిర్ణ‌యించారు. టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు.


14 రోజులపాటు జరిగే ఈ ఫెయిర్‌కు ఇప్పటివరకు 482 ప్రైవేట్ ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల నుంచి 3,000 స్టాళ్లు రానున్న‌ట్టు ఐటీపీవో సీనియర్ అధికారి తెలిపారు. కనీసం 3,500 ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని, 13 ఇత‌ర దేశాలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయ‌ని పేర్కొన్నారు. 1980 నుంచి ప్రారంభ‌మైన ఈ వాణిజ్య ప్రదర్శన దేశంలోనే అతిపెద్ద ట్రేడ్ ఫెయిర్‌గా పేరుగాంచింది.