అయోధ్యలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ షురూ

ఆధ్యాత్మిక క్షేత్రాలు కమర్షియల్‌ రూపుదిద్దుకోవడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా పుంజుకుంటూ ఉంటుంది. తాజాగా అయోధ్య విషయంలోనూ అది రుజువైంది

అయోధ్యలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ షురూ
  • 250 ప్లాట్లు విక్రయానికి రెడీ
  • ప్రారంభ ధర కోటీ 72 లక్షలు
  • 1200 కోట్ల పెట్టుబడి.. 51 ఎకరాలు
  • ప్రాజెక్టు ప్రారంభించిన లోధా కంపెనీ

అయోధ్య : ఆధ్యాత్మిక క్షేత్రాలు కమర్షియల్‌ రూపుదిద్దుకోవడంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా పుంజుకుంటూ ఉంటుంది. తాజాగా అయోధ్య విషయంలోనూ అది రుజువైంది. అయోధ్యలో రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన వెంటనే ముంబైకి చెందిన ప్రఖ్యాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ది హౌస్‌ ఆఫ్‌ అభినందన్‌ లోధా (హెచ్‌వోఏబీఎల్‌) అక్కడ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. 51 ఎకరాల్లో ప్రతిపాదించిన ప్రాజెక్టులో 250 ప్లాట్లు విక్రయించనున్నారు. 1250 చదరపు అడుగుల ప్లాట్‌ ధర కోటీ 72 లక్షలుగా నిర్ణయించారు. అయోధ్యలోని విలాసవంతమైన హౌసింగ్‌ ప్రాజెక్టు గురించి బ్రిటన్‌, అమెరికా, ఆగ్నేయాసియా దేశాల ఎన్నారైల నుంచి ఎంక్వయిరీలు వచ్చాయని హెచ్‌బోఏబీఎల్‌ సీఈవో సముజ్వల్‌ ఘోష్‌ చెప్పారు.


అదే విధంగా ముంబై, ఢిల్లీ, లక్నో, కాన్పూర్‌, మీరట్‌ నుంచి కూడా పలువురు ఫోన్‌ చేసి అయోధ్య ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. రానున్న మూడు నాలుగేళ్లలో యూపీలో 3వేల కోట్లను వెచ్చించాలని కంపెనీ యోచిస్తున్నదని సమాచారం. ప్రస్తుతం నిర్మించిన రామాలయానికి పదిపదిహేను నిమిషాల్లోనే చేరుకునేంత దూరంలో లోధా ప్రాజెక్టు ఉంటుంది. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పటికే సరయూ పేరిట లోధా నిర్మించిన సెవెన్‌ స్టార్‌ మిక్స్‌డ్‌ యూజ్‌ ఎన్‌క్లేవ్‌లో ప్లాట్‌ కొనుగోలు చేశారు. ఇక్కడ పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 14.5 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకునే ఉద్దేశంలో అమితాబ్‌ ఉన్నారని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి.