దొంగ ముండా.. పనికిరాని దాన.. మహిళపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే భాస్కరరావు

దొంగ ముండా.. పనికిరాని దాన.. మహిళపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే భాస్కరరావు
  • గృహలక్ష్మి అడిగినందుకే ఆగ్రహం
  • తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఎమ్మెల్యే తీరుపై పెరుగుతున్న వ్యతిరేకత


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు మరోసారి నోరుపారేసుకున్నారు. గృహలక్ష్మి అడిగినందుకు మహిళపై ఆగ్రహంతో ఊగిపోయారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గ్రామానికి చెందిన వనం విజయ.. తనకు గృహలక్ష్మి పథకం కేటాయించాలని అడిగింది.


ఇంకేముంది ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే భాస్కరరావు బూతుపురాణం అందుకున్నారు. ‘నీకు ఏ పథకం ఇవ్వను. నీ అంతు చూస్తా. దొంగ ముండా, పనికిరాని దాన’ అంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. అక్కడితో ఆగక, అక్కడున్న పోలీసులకు ‘దాన్ని నెట్టేయండి’ అంటూ హుకూం జారీ చేశాడు. బాధిత మహిళపై చేసిన వ్యాఖ్యలు స్థానిక ప్రజల్లో సైతం ఆగ్రహాన్ని రేపాయి. పోలీసులు ఆమెను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు.



గ్రామంలో పార్టీ కార్యకర్తలకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేశారని, కడు పేదరికంలో ఉన్న తనకు ఒక యూనిట్ కేటాయించాలని అడగింది. దీంతో ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడడాన్ని స్థానికులు సైతం వ్యతిరేకిస్తున్నారు. సంక్షేమ పథకాలు అడిగినందుకుగాను విజయపై ఎమ్మెల్యే మాట్లాడిన తీరు అక్కడున్న నాయకులు, కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.


సరిగ్గా 15 రోజుల క్రితమే అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను చెప్పేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అంగన్వాడీలను సైతం అడ్డగోలుగా మాట్లాడి వివాదాస్పదమయ్యారు. గతంలో దామరచర్లలో కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి, తాను వేసిన రోడ్లపై నడవొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఇలా ఎమ్మెల్యే వెళ్లిన ప్రతి దగ్గర ఏదో ఒక వివాదాస్పదంగా మాట్లాడుతూ నిత్యం వివాదాలకు నిలువుగా మారారు.


ఎమ్మెల్యే భాస్కరరావుకు వయసు మీద పడడంతో స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇక ఆయన రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలని స్థానికులు కామెంట్ చేస్తున్నారు. అంగన్వాడీలపై నోరు పారేసుకుని సరిగ్గా రెండు వారాలు కాకముందే, శెట్టిపాలెం గ్రామంలో ఓ మహిళపై బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే తీరు స్థానిక ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.