యువతి డ్రెస్‌పై నెట్టింట్లో రగడ.. మూగ జీవాలను హింసిస్తున్నావని ఆగ్రహం..

విధాత: ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఏదో ఫ్యాషన్ షో జరుగుతూ ఉంటుంది. అందరి కంటే భిన్నంగా అలంకరించుకుని ప్రధాన ఆకర్షణగా నిలవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇవి ప్రశంసలను తీసుకురాగా.. మరికొన్ని సార్లు విమర్శలను తీసుకొస్తాయి. తాజాగా చెన్నై (Chennai) లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో యువతి ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
మూగజీవాల మీద కాస్తైనా దయ లేదా అని తిట్టిపోస్తున్నారు. వారు అంతలా తిట్టేలా ఆ యువతి ఏం చేసిందననేనా మీ సందేహం? ఏకంగా తన డ్రెస్‌కు పొట్ట వద్ద అక్వేరియం తరహాలో చిన్న ఏర్పాటు చేసి వాటిలో సుమారు 10 సజీవ చేపలను వదిలింది. అలానే ర్యాంప్‌పై హొయలొలికించింది. మేక్ ఓవర్ బై ప్రీతి అనే ఇన్‌స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయగా విమర్శలు క్యూ కడుతున్నాయి.
మీ సరదా కోసం జంతువులను హింసించడం మానండి అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా.. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత చిన్న ప్రదేశంలో అన్ని చేపలను ఉంచితే.. అవి గాలి ఆడక నరకం చూస్తాయి. మీకు కాస్తైనా ఆలోచన లేదా అని ఒక యూజర్ ప్రశ్నించాడు. తన ఆలోచన, ఉద్దేశం మంచిదైతే కావొచ్చు.. కానీ చేపలను హింసించడం బాధ కలిగించింది అని మరొక వ్యక్తి చెప్పుకొచ్చాడు. అయితే ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ ఉర్ఫా జావేద్ మాత్రం తనకు ఈ డ్రెస్ నచ్చిందని చెప్పడం గమనార్హం.