ప్రాణ ప్రతిష్ఠ పూజకు మోదీ అనర్హుడు.. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

- భార్య విషయంలో రాముడిని అనుసరించిన వారుకాదు
- పదేళ్ల పాలనలో రామరాజ్యానికి అనుగుణంగా వ్యవహరించిందీ లేదు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఒక ట్వీట్ వైరల్ అవుతున్నది. మోదీ బలవంతంగా ప్రాణప్రతిష్ఠ పూజలోకి చొరబడ్డారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ‘పూజలో ప్రధాని హోదాకు ఎటువంటి పాత్ర లేదు. ఆయన తన వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా తన భార్య విషయంలో భగవాన్ రాముడిని అనుసరించినవారూ కాదు. గత దశాబ్దకాలంలో ప్రధానిగా రామరాజ్యానికి అనుగుణంగా వ్యవహరించినవారూ కాదు’ అని సుబ్రమణ్యస్వామి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. గత నెలలో కూడా స్వామి మోదీపై విమర్శలు గుప్పించారు. ‘రామభక్తులుగా అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ పూజ చేయడానికి మోదీని ఎలా అనుమతిస్తాం? రాముడు ఒకటిన్నర దశాబ్దాలపాటు అరణ్యవాసం చేశారు. తన భార్య సీతను కాపాడుకోవడానికి ఒక యుద్ధమే చేశారు. తన భార్యను వదిలేసిన వ్యక్తిగా మోదీ అందరికీ తెలుసు. ఆయన ఎలా పూజ చేస్తారు?’ డాక్టర్ స్వామి ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు.