Bhima Koregaon Case : భీమా కోరేగావ్‌ కేసులో నవలఖకు బెయిల్‌

భీమా కోరేగావ్‌/ ఎల్గార్‌ పరిషద్‌ కేసులో 2018లో ఉపా చట్టం కింద అరెస్టయిన మానవ హక్కుల కార్యకర్త, పాత్రికేయుడు గౌతం నవలఖా (Gautam Navlakha) కు సుప్రీంకోర్టు మే 14, 2024న బెయిల్‌ ఇచ్చింది.

Bhima Koregaon Case : భీమా కోరేగావ్‌ కేసులో నవలఖకు బెయిల్‌

బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు
రెండేళ్లుగా గృహనిర్బంధంలో ఉన్న హక్కుల ఉద్యమనేత

భీమా కోరేగావ్‌/ ఎల్గార్‌ పరిషద్‌ కేసులో 2018లో ఉపా చట్టం కింద అరెస్టయిన మానవ హక్కుల కార్యకర్త, పాత్రికేయుడు గౌతం నవలఖా (Gautam Navlakha) కు సుప్రీంకోర్టు మే 14, 2024న బెయిల్‌ ఇచ్చింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఎత్తివేసింది. 2022 నవంబర్‌ నుంచి నవలఖ నవీముంబై లోని తన నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. అంతకు ముందు 2020లో అరెస్టయిన దగ్గర నుంచి తలోజా జైల్లో ఉన్నారు. నవలఖ మానవ హక్కుల కార్యకర్త. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (పీయూడీఆర్‌) కార్యదర్శిగా పనిచేశారు.

బాంబే హైకోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, పైగా కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున వాటిపై స్టే పొడిగించలేమని జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం పేర్కొన్నది. దీర్ఘకాలంగా జైల్లో ఉన్న నవలఖపై ఇంత వరకూ అభియోగాలను కూడా మోపలేదని పేర్కొన్నది. గృహనిర్బంధం సమయంలో భద్రతకు వెచ్చించిన 20 లక్షల రూపాయలను ఎన్‌ఐఏకు చెల్లించాలని నవలఖను కోర్టు ఆదేశించింది.

నవలఖకు 2023లో బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. ఉపా చట్టం కింద ఆయన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నది. ఇదే కేసులో అరెస్టయిన విద్యావేత్త, నాగపూర్‌ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ షోమాసేన్‌ (62)కు ఆరేళ్ల అనంతరం 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది.

భీమా కోరేగావ్‌ కేసులో మొత్తం 16 మంది విద్యావేత్తలు, హక్కుల ఉద్యమకారులు ఉండగా.. వారిలో బెయిల్ పొందిన ఏడో వ్యక్తి నవలఖ. షోమాషేన్‌, సుధా భరద్వాజ్‌, అనంద్‌ తేల్టుంబ్డే, వెర్నాన్‌ గొజాల్వెజ్‌, అరుణా ఫెర్రియరా, వరవరరావు (ఆరోగ్య కారణాలపై) బెయిల్‌ పొందినవారిలో ఉన్నారు. ఫాదర్‌ స్టాన్‌ స్వామి 84 ఏళ్ల వయసులో జైల్లో అనారోగ్యానికి గురై 2021లో చనిపోయారు.