Suvendu Adhikari | ప్రధాని ‘సబ్‌ కా సాథ్‌‘ నినాదాన్ని తిరస్కరించిన బెంగాల్‌ బీజేపీ నేత సువేంధు అధికారి

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ అని చెబుతుంటే.. బీజేపీ నాయకులు మాత్రం దానిని అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.

Suvendu Adhikari | ప్రధాని ‘సబ్‌ కా సాథ్‌‘ నినాదాన్ని తిరస్కరించిన బెంగాల్‌ బీజేపీ నేత సువేంధు అధికారి

బీజేపీ మైనార్టీ మోర్చాలను మూసివేయాలని వ్యాఖ్య
తమ వెంట ఉండేవాళ్ల పక్షమే ఉంటామని వెల్లడి

కోల్‌కతా: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ అని చెబుతుంటే.. బీజేపీ నాయకులు మాత్రం దానిని అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. సబ్‌ కా సాథ.. సబ్‌ కా వికాస్‌ నినాదం బీజేపీకి అవసరం లేదని, బీజేపీ మైనార్టీ మోర్చాలను మూసివేయాలని ఆ పార్టీ
పశ్చిమబెంగాల్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేంధు అధికారి చెప్పారు. ‘మనం హిందువులను కాపాడుతాం. రాజ్యాంగాన్ని కాపాడుతాం. నేను జాతీయవాద ముస్లింల గురించి మాట్లాడాను. మీరంతా సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ అంటున్నారు. ఇక మనం అది ఆపాలి. దాని బదులు.. ‘మా వెంట ఉండే వాళ్ల వెంటే మేం ఉంటాం’ అని చెప్పాలి. సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ కో బంద్‌ కరో’ అని నందిగ్రామ్‌ ఎమ్మెల్యే అయిన సువేంధు అధికారి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారి బుధవారం నిర్వహించిన రాష్ట్ర బీజేపీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బీజేపీకి మైనార్టీ మోర్చాల అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఇటీవలి ఎన్నికల్లో 12కు పరిమితమైంది. దాదాపు 30 సీట్లలో అభ్యర్థుల ఎంపికలో సువేంధు అధికారి నిర్ణయాలు తీసుకున్నారంటూ పార్టీలో కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నినాదానికి భిన్నంగా సువేందు అధికారి మాట్లాడిన విషయంలో ఇంత వరకూ బీజేపీ సీనియర్‌ నేతలు ఎవరూ స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ మీడియాతో మాట్లాడుతూ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను జైల్లో పెట్టి, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవలేమని వ్యాఖ్యానించారు. ‘కొన్ని సమయాల్లో పార్టీ కార్యకర్తలు కొందరిని సీబీఐతో అరెస్టు చేయించాలని కోరుతుంటారు. దానితో నియోజకవర్గంలో విజయం సాధించొచ్చనేది వారి భావన. కానీ.. అది జరుగదు. ఎవరైనా నాయకుడిని అరెస్టు చేయిస్తే విజయం సాధించొచ్చని వారు అనుకుంటారు. అది అసాధ్యం’ అని జూలై 13న మిడ్నాపూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు.