ప్రతిపక్షాల విమర్శలకు మతంతో మోదీ కౌంటర్‌

మతప్రాతిపదికన తప్ప బీజేపీ ఎన్నికల్లో ఓట్లు అడగదని మరోసారి రుజువైంది. ఇప్పటికే తన ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్న మోదీ.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు లేవనెత్తుతున్న సామాజిక, ఆర్థిక అంశాలకు సైతం మతం అంశంతో కౌంటర్‌ ఇచ్చారు

ప్రతిపక్షాల విమర్శలకు మతంతో మోదీ కౌంటర్‌

అయోధ్యకు బాబ్రీ తాళం వేయకుండా చూసేందుకే..
మళ్లీ 370 ఆర్టికల్‌ తీసుకురాకుండా చూసేందుకే
మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని వ్యాఖ్యలు

భోపాల్‌: మతప్రాతిపదికన తప్ప బీజేపీ ఎన్నికల్లో ఓట్లు అడగదని మరోసారి రుజువైంది. ఇప్పటికే తన ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్న మోదీ.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు లేవనెత్తుతున్న సామాజిక, ఆర్థిక అంశాలకు సైతం మతం అంశంతో కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకే 400 సీట్లు అడుగుతున్నదని ఇండియా కూటమి విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది ప్రజల్లో బాగా వెళ్లటంతో కొంతకాలంగా మోదీ చార్‌ సౌ పార్‌ నినాదాన్ని కాస్త పక్కకు పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆయన మళ్లీ అదే అంశాన్ని బయటకు తీసి.. దానికి మతాన్ని జోడిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి.. 400 సీట్లు ఎందుకు అడుగుతున్నదో చెప్పిన మోదీ.. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ 370 ఆర్టికల్‌ను తీసుకురాకుండా ఉండేందుకు, అయోధ్యలో రామాలయానికి బాబ్రీమసీదు తాళం వేయకుండా అడ్డుకునేందుకే తాము 400 సీట్లు అడుగుతున్నామని వాదించారు.

మధ్యప్రదేశ్‌లోని ధర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కృషిని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించిందని ఆరోపించారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని విమర్శించారు. ఎన్డీయేకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారని వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. తమకు పార్లమెంటులో ఇప్పటికే 400కుపైగా సీట్లు ఉన్నాయని మోదీ చెప్పారు.

ఈ సంఖ్యాబలం ఆధారంగానే తాము జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేశామని అన్నారు. ఆ అధికరణాన్ని కాంగ్రెస్‌ మళ్లీ తీసుకురాకుండా చూసేందుకే మోదీ 400 సీట్లు అడుగుతున్నాడు. అయోధ్యలో రామాలయానికి కాంగ్రెస్‌ బాబ్రీ తాళం వేయకుండా చూసేందుకే మోదీ 400 సీట్లు అడుగుతున్నాడు’ అని ఆయన రివర్స్‌లో దాడి చేశారు.

మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబోమని 140 కోట్ల మంది ప్రజలకు రాతపూర్వకంగా ఇవ్వాలని తాను 14 రోజుల క్రితం కాంగ్రెస్‌కు సవాలు చేశానని ప్రధాని తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ నుంచి తగ్గించి, మైనార్టీలకు రిజర్వేషన్‌ ఇవ్వబోమని చెప్పాలని కోరానని అన్నారు. ఓబీసీ కోటా నుంచి మైనార్టీలకు రిజర్వేషన్‌ ఇవ్వబోమని చెప్పాలన్నానని తెలిపారు. ఈ నాలుగు వందల సీట్లతోనే తాము ఎస్సీ, ఎస్టీ కోటాను మరో పదేళ్లు పొడిగించామని, దేశంలోనే తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పుకొన్నారు.

వాస్తవానికి కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిందే కానీ, ఉన్న కోటాలోంచి మైనార్టీలకు ఇస్తామని చెప్పలేదని కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు వీలుగా ఇప్పటి వరకూ వాటిపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని తమ నేత రాహుల్‌ గాంధీ పదేపదే చెబుతూ వస్తున్నారని అన్నారు. మోదీ మాత్రం తమ ప్రశ్నలకు నేరుగా జవాబివ్వకుండా సామాజిక, ఆర్థిక, దేశభవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై మళ్లీ మతం కార్డును వాడుకుని, మత రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు.