స్పీకర్ కోర్టుకు లోబడాల్సిందే: సుప్రీంకోర్టు

- ఆయన సభలోనే అత్యున్నతుడు
- మహారాష్ట్ర ఎమ్మెల్యేల అనర్హత
- పిటిషన్లపై ఎందుకంత సాగదీత
- అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్టోబర్ 30 నాటికి ఒక తుది నిర్ణయం తీసుకోని పక్షంలో తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. 80 మంది ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించాలంటూ శివసేన, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదన్న అంశంలో సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. చర్యలు తీసుకునే విషయంలో తుది నిర్ణయాన్ని అక్టోబర్ 30 లోపు ప్రకటించాలని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను ఆదేశించింది. లేనిపక్షంలో తాము అందుకు టైమ్ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కాగా.. తాను స్పీకర్‌తో కూర్చొని, అక్టోబర్ 30 లోపు ప్రొసీడింగ్స్‌ను ముగించేందుకు స్పష్టమైన టైమ్ ఫ్రేమ్‌ను రూపొందిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పినప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు అర్థంవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో అనర్హత పిటిషన్లను సత్వరమే పరిష్కరించాలని తాము ఆదేశించినప్పటికీ.. స్పీకర్ న్యాయస్థానం అధిపతి తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
‘పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఆయన మాత్రం వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. సుప్రీం ఎలా ఉన్నతమైనదో తాము కూడా అంతే ఉన్నతులమని చెబుతుంటారు. ఆయన తాను చేయాల్సిన పనిని చేయకుండా.. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సభలో ఏం జరుగుతున్నదన్న విషయంలో మాకు సంబంధం లేదు. కనుక ఆయన కోర్టుకు లోబడి ఉండాల్సిందే. సభలో జరిగే విషయాల్లో ఆయన అత్యున్నతం అనే దాంట్లో సందేహం లేదు.
కానీ.. అనర్హత పిటిషన్ విచారణ విషయంలో సుప్రీం కోర్టు పరిధికి ఆయన లోబడి ఉండాల్సిందే’ అని సీజేఐ పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది మేలో తీర్పునిస్తే ఇంతకాలం స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి తుషార్ మెహతా బదులిస్తూ.. సుప్రీం కోర్టు కోరితే ఈ విషయంలో నిర్వహించిన రోజువారీ కార్యకలాపాలను స్పీకర్ అందిస్తారని చెప్పారు. శివసేన చీలికవర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఇచ్చిన పిటిషన్లపై గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (పవార్) తరఫున తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు.
అజిత్‌పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ ఇచ్చిన పిటిషన్లపై కనీసం నోటీసు కూడా జారీ కాలేదని చెప్పారు. రోజువారీ ప్రొసీడింగ్స్ వివరాలను తాను అందజేస్తానని సొలిసిటర్ జనరల్ పేర్కొనగా.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, కానీ.. మే 11 నుంచీ ఏమీ చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరో వాయిదా కోరారనో, లేదా కౌంటర్ దాఖలుకు సమయం కోరారనో అటూ ఇటూ తిప్పడం తప్ప స్పీకర్ చేసిందేమీ లేదని పేర్కొన్నది. ఎప్పటిలోగా ఒక తుది నిర్ణయానికి వస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.