ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

ముదిరాజ్ సామాజిక వర్గంలో ఈటల రాజేందర్ ఎవ్వరినీ ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాము ముదిరాజ్‌లకు అవకాశాలు ఇచ్చామని, బండా ప్రకాశ్‌ను ఎంపీ, ఎమ్మెల్సీ, మండలి వైస్ చైర్మన్‌గా చేసుకున్నామని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో జ్ఞానేశ్వర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌ను ఎంపీ చేసుకున్నాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసుకున్నాం. ఇప్పుడు మండలి వైస్ చైర్మన్‌గా నియమించుకున్నాం. మీకు రాజకీయాలు తెలుసు.. మనకున్నవి మొత్తం 119 సీట్లు.. అందులో ఏడు మనవి కావు. మనకున్నది కేవలం 112 సీట్లు. ఆ సీట్లలో పెట్టిన వ్యక్తి పక్కా గెలవాలి. ఏదో తమాషాకు అభ్యర్థిని బరిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి నష్టం చేకూర్చోవడం రాజకీయం కాదు. ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో అందరం కలిసి కూర్చుందాం. ఎన్టీ రామారావు పీరియడ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి సాధించాం.
దాంతో కొంత మంది రాజకీయ నాయకులు ఎదిగారు. రాజకీయంగా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి. చాలా అవకాశాలు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వర్గం పెద్దది కాబట్టి ఆ వర్గం నుంచి మనం నాయకులను తయారు చేసుకోవాలి. జిల్లాకు ఒకరిద్దరిని తయారు చేసుకుంటే పార్లమెంట్‌కు పెట్టుకోవచ్చు.. అసెంబ్లీకి పెట్టుకోవచ్చు. ఎమ్మెల్సీలు కూడా కావొచ్చు.. అలా చాలా అవకాశాలు ఉంటాయి. రాజేందర్ అటు పోయినా.. పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడం మంచి పరిణామం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.