Telangana: రాష్ట్ర ఎంపీలతో సర్కారు సమావేశం.. విపక్ష ఎంపీలు హాజరయ్యేనా!

Telangana:
- ప్రజా భవన్‌లో శనివారం రాష్ట్ర ఎంపీల సమావేశం
- కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండా
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండికి భట్టి ఫోన్
- సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
విధాత ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangan Govt) నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర మంత్రులతో పాటు విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలందరికీ సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విపక్ష పార్టీల ఎంపీలు హాజరవుతారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలపై ఎంపీలు రాష్ట్రం పక్షాన పార్లమెంట్ లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) హాజరుకానున్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) ల తో పాటు విపక్ష ఎంపీలు హాజరవుతారా? అనే సంశయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం నుంచి బీజేపీ లోక్ సభతో పాటు రాజ్యసభ్యుడున్నారు. బీఆర్ఎస్ కు లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం లేనప్పటికీ రాజ్యసభ నుంచి సభ్యులున్నారు. విపక్ష ఎంపీలు హాజరవుతారా? లేదా? అనే చర్చ సాగుతోంది.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రా ప్రాజెక్టులతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా కేంద్రం నుంచి పంపిన ప్రతిపాదనలు రాష్ట్రంలో పెండింగులో ఉన్నాయని చెబుతూ వాటి వివరాలను సీఎంకు అందజేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులపై రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.
ఇదిలాఉండగా ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ముందు ప్రతిపాదించిన ప్రాజెక్టులను తీసుకరావడంతో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని సీఎం రేవంత్ (Cm Revanth Reddy) విమర్శించారు. అభివృద్ధి పథకాలకు కిషన్ రెడ్డి మోకాలొడ్డుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమావేశానికి ప్రాముఖ్యత నెలకొంది. శనివారం జరిగే సమావేశం పై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ కొనసాగనున్నది.