Adilabad | కాంగ్రెస్ బీసీ గర్జన సభ రసాభాసా.. కందిపై సస్పెన్షన్ వేటు
కంది-సాజీద్‌ఖాన్ వర్గాల మధ్య తోపులాట నివారించేందుకు ప్రయత్నించిన విహెచ్ క్రమశిక్షణ ఉల్లంఘన కింద కందిపై సస్పెన్షన్ వేటు Adilabad | విధాత: ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన సభ రసాభాసాగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీసీ గర్జన సభలో రగడకు కారణమైన ఎన్నారై కంది శ్రీనివాస్‌రెడ్డిపై కాంగ్రెస్ […]

- కంది-సాజీద్‌ఖాన్ వర్గాల మధ్య తోపులాట
- నివారించేందుకు ప్రయత్నించిన విహెచ్
- క్రమశిక్షణ ఉల్లంఘన కింద కందిపై సస్పెన్షన్ వేటు
Adilabad | విధాత: ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన సభ రసాభాసాగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీసీ గర్జన సభలో రగడకు కారణమైన ఎన్నారై కంది శ్రీనివాస్‌రెడ్డిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సస్పెండ్ వేటు వేశారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హజరయ్యారు. కాగా ఈ సమావేశానికి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డి కూడా హజరయ్యేందుకు వచ్చారు. బాడీగార్డులు, బౌన్సర్లతో సభకు వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి లోపలికి రాకుండా గేట్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన బౌన్సర్లు, బాడిగార్డులకు, కార్యకర్తలకు నడుమ తోపులాట జరిగింది. ఓ సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు ఇరువర్గాలను నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం సభలో హంగామా సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సస్పెన్షన్ వేటు విధించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించి ప్రవర్తించినందునే ఈ చర్య తీసుకున్నామని సాజిద్ ఖాన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బీసీల ఐక్యత కోసం గళమెత్తిన తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చొరబడ్డ కొన్ని సంఘ విద్రోహక శక్తుల కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని అన్నారు. కాగా కంది శ్రీనివాస్ రెడ్డి పై జిల్లా కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే జిల్లా కమిటీ నిర్ణయానికి రాష్ట్ర పార్టీ అధిష్టానం ఆమోద ముద్రవేస్తుందా లేదా వేచి చూడాల్సివుంది.