BRS రజతోత్సవ సభ.. బండెనక బండి కట్టి బయలెల్లిన జగదీష్ రెడ్డి గులాబీ దండు!

విధాత: బండెనక బండి కట్టి..పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లె వస్తవ్ కొడుకో.. నైజాం సర్కారోడా..అంటూ ప్రజాకవి బండి యాదగిరి నినదించిన పోరుగడ్డ సూర్యాపేట నుంచి మరోసారి బండెనక బండి కట్టిన దృశ్యం సాక్షాత్కరించింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ముందస్తుగా ఎండ్ల బండ్లల యాత్రగా బయలుదేరారు.
5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి 27న వారు సభా స్థలికి చేరుకోనున్నారు. గులాబీ రంగులతో ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ఎండ్ల బండ్లు జాతీయ రహదారి మీదుగా బారులు కట్టి సాగగా.. ఎండ్లబండ్ల శ్రేణికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదీష్ రెడ్డి స్వయంగా 5 కి.మీ పైగా ఎడ్లబండి తోలి ఉత్సాహంగా పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేశారని..కొండంత అభిమానంతో ఎండల్లో సాహసోపేతంగా ఎడ్లబండ్ల యాత్రగా వరంగల్ సభకు వెళ్తున్న రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలం నుంచి బయలుదేరిన ఎండ్లబండ్ల యాత్రకు దారి వెంట గ్రామాల ప్రజలు, రైతులు, గులాబీ పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉందన్నారు.
రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామనుకుంటున్నారని..నీడలో ఉన్న వాళ్ళం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కేసీఆర్ ని వదులుకున్నామన్న బాధలో ప్రజలంతా ఉన్నారని.. అందుకే ఆయనపై అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలంతా హాజరై కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేక సభలాగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారన్నారు.
నిన్నటి దాక నాయకుల్లో తప్ప కేడర్ లో రజతోత్సవ సంబరాల జోష్ కనిపించని పరిస్థితుల్లో జగదీష్ రెడ్డి ప్రారంభించిన ఎండ్లబండ్ల యాత్ర కొత్త ఉత్సాహాన్ని రగిలించింది. జగదీష్ రెడ్డి ఎండ్లబండ్ల యాత్ర వైరల్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో రజతోత్సవ సన్నాహాల్లో జోష్ తీసుకొచ్చింది. తమ ప్రాంతాల నుంచి కూడా ఏదో ఒక ప్రత్యేకతతో తరలివేళ్లాలన్న ఆలోచనతో గులాబీ కేడర్ సన్నద్దమయ్యేలా ఎండ్ల బండ్ల యాత్ర స్ఫూర్తినిచ్చిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.