Owaisi | పాకిస్తాన్ పతనం ఖాయం.. పాక్‌పై నిప్పులు చెరిగిన ఒవైసీ!

విధాత, న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై మండి పడుతున్న ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ మరోసారి ఆ దేశంపై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుందని.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గబోదన్నారు. భారత్ గట్టిగా తలుచుకుంటే పాక్ పతనం ఖాయమన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందని హెచ్చరించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన హాజరై మాట్లాడారు.
పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంద న్నారు. దేవుడి దయతో మనం భారతభూమిపై జన్మించామని.. భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామన్నారు. “అమ్మ కడుపు నుంచి భూమిపై అడుగుపెట్టిన క్షణం నుంచీ చివరి శ్వాస వరకు ఈ దేశం కోసమే బ్రతకాలి” అని భావోద్వేగంతో ప్రకటించారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందని.. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలను, అమాయకులను చంపే పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలన్నారు.
ముస్లింలకు ప్రత్యేక దేశం అక్కర లేదు
ఇస్లాం మతాన్ని వాడుకుని ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని పాక్ చూస్తుందని ఒవైసీ విమర్శించారు. ఇండియాలో ఉన్న ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం లేదని, తాము ఇక్కడే ఉంటామన్నారు. భారత్ లో ఉన్న ముస్లింలకు మరో దేశం కావాలనే పాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము ఎప్పుడో వ్యతిరేకించామని తెలిపారు.
భారత్ లో 23కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారని, తమకు మరో దేశం అవసరమే లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తర్వతా మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్ లో ఉన్న ముస్లింలు ఎప్పుడో వ్యతిరేకించారని, ఇప్పుడు మళ్లీ పాక్ ఆ పాత పాచిపోయిన మాటనే వాడుకుని ఇండియాలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.
భారత్ పై ద్వేషంతో పాక్ స్వీయ నాశనం
ఇస్లాం ముసుగులో గత 75ఏళ్లుగా భారత్ పై పాక్ కుట్రలు పన్నుతునే ఉందని..తద్వారా స్వీయ వినాశనం తప్ప ఏమీ సాధించలేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం కోసం రాజకీయ అవసరాల కోసం ఇస్లాంను వాడుకుని తమను తామే నాశనం చేసుకునే వరకు పాక్ దిగజారిపోయిందన్నారు.
రెండు దేశాల సిద్ధాంతం చెప్పే పాకిస్తాన్ మరి అఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ లో ఎందుకు కాల్పులు జరుపుతుందని ఒవైసీ ప్రశ్నించారు. ఆ దేశాల్లోనూ ఉన్నది ముస్లింలేనన్న విషయం ఎందుకు పాక్ మరిచిపోతుందని నిలదీశారు. ఇస్లాం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ ఇతర ముస్లిం దేశాలపై ఎందుకు దాడులు చేస్తుందని ఒవైసీ నిలదీశారు.