Local Polls | తెలంగాణ పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

  • By: TAAZ    news    Jun 23, 2025 9:30 PM IST
Local Polls | తెలంగాణ పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Local Polls | తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టులో ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు ముగిశాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ఎన్నిల విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి.

ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. 2024 ఫిబ్రవరి 1 న తెలంగాణ సర్పంచ్ ల పదవీకాలం ముగిసిందని..పదవీకాలం ముగిశాక ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న నిబంధనను గుర్తు చేశారు పిటిషనర్లు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది.