ఆపరేషన్ కగార్ నిలిపివేసి.. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

  • By: sr    news    Apr 28, 2025 5:10 PM IST
ఆపరేషన్ కగార్ నిలిపివేసి.. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్

విధాత: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆపరేషన్ కగార్ నిలిపివేసి సిపిఐ (మావోయిస్టు) పార్టీతో శాంతి చర్చలు‌ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ( బీజేపీ), రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపకుండా ఆదివాసీలపై దమనకాండకు పాల్పడుతున్నారని, ఇది సమంజసం కాదని అన్నారు.

విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఆదివాసీలను నిర్వాసితులు చేస్తూ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తోందని అన్నారు. షెడ్యూల్ ఐదు ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాస్తూ పీసా,1/70 చట్టాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఆదివాసీలకున్న రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చల కమిటీ ఉపాధ్యక్షులు జంపన్న మాట్లాడుతూ ఆదివాసుల సంక్షేమం దృష్ట్యా ఇరుపక్షాలు శాంతిని పాటించాలని కోరారు.

ఈ సమావేశంలో ప్రోగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు ఆవుల నాగరాజు, కోట ఆనందరావు,ఎఐఎస్ఎఫ్ నాయకులు ఉదయ్,డిఎస్ఎ రాష్ట్ర కో- కన్వీనర్ గణేష్, పిడిఎస్ యు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు ఆసిఫ్,పిడిఎస్ యు (విజృంభణ) కార్యదర్శి అల్లూరి విజయ్,ఆల్ ఇండియా బిసి విద్యార్థి సంఘం‌ నాయకులు గణేష్,రాము గౌడ్, కరణ్ లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు ప్రశాంత్, శ్రీధర్ యాదవ్, సృజన్, రాజశేఖర్, పవన్, రాకేశ్, జైభీమ్ రిసెర్చ్ స్కాలర్ సునీల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.