Addanki Dayakar: జనతా గ్యారేజీలో ఓనర్ కొడుకు విలన్.. మరీ నీవు?: KTRపై అద్దంకి ఫైర్

విధాత: BRS జనతా గ్యారేజ్ గా పనిచేస్తుందని.. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని KTR చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్ లో అద్ధంకి మీడియాతో మాట్లాడారు. జనతా గ్యారేజ్ లో ఓనర్ కొడుకు విలన్ అని.. మీ జనతా గ్యారేజ్ లో నువ్వు విలన్ అన్నట్లా? అని కేటీఆర్ ను అద్ధంకి ప్రశ్నించారు. కేసీఆర్ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ కేటీఆర్, హరీష్ రావు, కవితలు ప్రజలకు కథలు చెబుతున్నారని.. కేసీఆర్ బయటకు వచ్చి పిట్ట కథలు చెప్తారా?” అని అద్ధంకి ప్రశ్నించారు. అసలు రజతోత్సవ సభ ఏ పార్టీకి అని అద్ధంకి నిలదీశారు. బీఆర్ఎస్ పుట్టి 3ఏళ్లు, టీఆర్ఎస్ కనుమరుగై మూడు ఏళ్లు అని.. ఇప్పుడు దేనికి రజతోత్సవాలో చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ కు దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసీ అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలని సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అని గుర్తు చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర అధ్యక్షుడిని చేయండి? అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ రజతోత్సవ సభ కోసం 300 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలిస్తున్నారని దయాకర్ ఆరోపించారు. చేయి గుర్తుకు వ్యతిరేకంగా గులాబీ కాడకు కమలం పువ్వు అంటుపెట్టారని విమర్శించారు.
సన్న బియ్యం తెలంగాణలో ఇస్తుంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోసమే బ్రతుకుతున్నదని.. మళ్ళీ ఎన్డీఏ లోకి పోవాలని కేటీఆర్ చంద్రబాబుకు బిస్కెట్లు వేస్తున్నడని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు హెలికాప్టర్ వినియోగంపై ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమన్నారు. బీఆర్ఎస్ లాగ విలాసాలకు హెలికాప్టర్ వాడే అలవాటు కాంగ్రెస్ కు లేదని..వారిలాగా సొంత హెలికాప్టర్ కాంగ్రెస్‌కు లేదని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. ఒకేసారి రెండు మూడు అధికారిక పర్యటనలు ఉన్నప్పుడు సమయం, డబ్బు ఆదా కోసం హెలికాప్టర్ వాడుతున్నారని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/euuyPZsXKL
— Telangana Congress (@INCTelangana) April 24, 2025