Viral: ఈ నిమ్మకాయ ధర.. అక్షరాల రూ.25వేలు!

విధాత : ఒక్క నిమ్మకాయకు మహా అయితే ఆన్ సీజన్ లో గరిష్టంగా రూ.5 ఉంటుంది. సీజన్ లో అయితే కొనే వారు తక్కువై రైతులు రోడ్ల మీద పారబోసి తమ నిరసనలు వ్యక్తం చేస్తుండటం చూస్తుంటాం. అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ నిమ్మకాయ రూ.25వేల ధర పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా శివగిరిలోని సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి పూజలో ఉంచిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేశారు. వేలం పాటలో పాల్గొన్న భక్తులు ఆ పవిత్ర నిమ్మకాయను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు వేలం పాటలో కందసామిపాలం నుంచి వచ్చిన ఓ భక్తుడు రూ.25వేలకు ఆ నిమ్మకాయను దక్కించుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటంతో పాటు ఆ నిమ్మకాయను అందించి ఆశీర్వదించి పంపారు.