Khammam | మంత్రి కార్యక్రమం నాకు చెప్పరా?: అధికారులపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం!

  • By: sr    news    Apr 29, 2025 3:51 PM IST
Khammam | మంత్రి కార్యక్రమం నాకు చెప్పరా?: అధికారులపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం!

Khammam |

విధాత: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటనలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మంత్రి తుమ్మల పర్యటన వివరాలను ఎమ్మెల్యే అయిన నాకు చెప్పకపోవడం ఏమిటని..ఎందుకు చెప్పలేదని అధికారులపై ఆదినారాయణ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పంతంతో రూ.15 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.

వివరాల్లోకి వెళితే దమ్మపేట మండలంలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి పూసుకుంట, కట్కూరు గ్రామాల పర్యటన సాగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించాల్సి ఉంది. తర్వాత పూసుకుంటలో ఆయిల్ ఫామ్ మొక్కలు, తేనెటీగల పెంపకం పెట్టెలను అందజేయాల్సి ఉంది. మంత్రి పర్యటన షెడ్యూల్ పై సోమవారం రాత్రి ఎమ్మెల్యే జారె క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన కూడా వెలువడింది.

అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్లో లేనటువంటి రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే 10 కిలోమీటర్ల ఆర్ ఆండ్ బీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కు అందించలేదు. పర్యటన మధ్యలో తనకు తెలియకుండానే రోడ్డు పనుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే జారె ఆర్ ఆండ్ బీ అధికారులపై మండి పడ్డారు. ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నారా లేదా..? పిచ్చోడిలా కనిపిస్తున్నాడా..? నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే తనకి గౌరవం ఉందని.. కానీ అధికారులు తనని అవమానించేలా వ్యవహరించడంతో తన మనోభావం దెబ్బతిందన్నారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొననని..ఇది నిలిపివేయాలని లేదంటే పర్యటన మధ్యలోనే తిరిగి వెళ్లిపోతానని ఎమ్మెల్యే జారె తెగేసి చెప్పారు. మంత్రి తుమ్మల కలుగజేసుకొని ఎమ్మెల్యేకి సమాచారం అందించకపోవడం అధికారుల తప్పేనని.. దీనిపై తర్వాత చర్చిద్దామని జారె ను సముదాయించారు. అయితే జారె ఆదినారాయణ మాత్రం తన పంతం వీడకపోవడంతో శిలాఫలకం ఆవిష్కరించకుండానే మంత్రి తుమ్మల తన కారులో ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.