కిషన్ రెడ్డి: తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేయండి

కిషన్ రెడ్డి: తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేయండి

విధాత : కుల గణన..బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు బీసీని సీఎంగా చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం బీజేపీపైన, ప్రధాని మోదీపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ సీఎం చేస్తామని ప్రకటించిందని..కేంద్ర ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతను బీజేపీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 32శాతం రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్ ప్రభుత్వం బీసీ ఈ కోటాలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించగా..రాష్ట్ర హైకోర్టు రెండుసార్లు ఆ రిజర్వేషన్ చెల్లదని తీర్పునిచ్చిందన్నారు. దానిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుని అమలు చేస్తున్నారని..మళ్లీ ఇప్పుడు 4శాతాన్ని 10శాతానికి పెంచి బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. కులగణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి..బీసీ లు 56శాతం అని..46శాతం బీసీ హిందువులు, 10శాతం బీసీ ముస్లింలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రధాని మోదీ తెచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ లలో ముస్లింలకు కూడా అవకాశం ఉందన్న సంగతి మరువరాదన్నారు. మళ్లీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లలో 10శాతం ముస్లింలకు అంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. 42శాతం రాజకీయ రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. హైదరాబాద్ లో 170కార్పోరేట్ స్థానాల్లో 50సీట్లు బీసీలకు కేటాయిస్తే అందులో 30సీట్లు మజ్లిస్ గెలిచిందన్నారు. మళ్లీ ఇప్పుడు 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు పోటీ చేసే అవకాశముందన్నారు. దీంతో బీసీలకు న్యాయం ఎలా జరుగుతుందో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. 34శాతం హైదరాబాద్ లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు 32శాతంకు తగ్గించేలా రేవంత్ రెడ్డి 42శాతం రిజర్వేషన్ తెచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వేలకోట్లకు పడగలేత్తిన ఒవైసీ వంటివారితో సామాన్యులైన బీసీ పేద కులాలు ఎన్నికల్లో పోరాడుతాయో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం పదవికి బీసీలకు ఇవ్వాలి

వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే కాంగ్రెస్ తమ తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తూ బీజేపీపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు ఏనాడు పార్లమెంటులో అంగీకరించలేదని..ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాకా జనగణనకు తొలిసారిగా నిర్ణయం తీసుకుందన్నారు. మీలాగా బీసీలకు అన్యాయం చేసేలా మా జనగణన ఉండబోదన్నారు. 1947లో స్వాతంత్రం నుంచి కూడా తెలుగు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పీఎం, సీఎం పదవులు ఇవ్వలేదన్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు కేంద్రంలో అధికారంలో వస్తే రెండుసార్లు బీసీ మోదీని ప్రధానిని చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని..ముందు ఆయన రేవంత్ రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీ నాయకుడిని సీఎం చేయాలన్నారు. మంత్రివర్గంలో 42శాతం బీసీలకు పదవులు ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అని వ్యాఖ్యానించారని..మోదీ కులాన్ని కాంగ్రెస్ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వమే బీసీ కులాల్లో చేర్చిందని..ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో కూడా లేరని..దీనిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండగా…వరుసగా మూడోసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించి మోదీ నాయకత్వానికి పట్టం కట్టినా కాంగ్రెస్ ఆలోచన విధానం మారడం లేదన్నారు. అధికారం దక్కక నిరాశలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు.

పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 243 డి ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు భాధ్యత రాష్ర్ట ప్రభత్వాలదేనన్నారు. ముస్లింలను తెచ్చి బీసీలకు ఆన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మా డిమాండ్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు 42శాతం రిజర్వేషన్ల పరిధిలోకి రాకుడదన్నదేనని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లపై ఎవరు కోర్టుకు వెళ్లకముందే స్థానిక సంస్థలను రిజర్వేషన్ పెంచి నిర్వహించాలన్నారు. దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయాలన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని..అధిష్టానం ఎవరిని నిర్ణయించినా మేం స్వాగతిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫోను, కుటుంబ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పుకున్నారని.. ఇప్పుడు తన ఫోను ట్యాపింగ్ కాలేదని ఎందుకు చెప్పారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ను, కేసీఆర్ ఫ్యామిలీని రక్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని..ఇందుకు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి రాహుల్ గాంధీకి మధ్య అవగాహన కుదిరిందని తేలిపోయిందన్నారు.