Vinesh Phogat | వినేశ్‌ ఫొగట్‌పై అనర్హతకు వైద్యులు, కోచ్‌లదే బాధ్యత : మహావీర్‌సింగ్‌ ఫొగట్‌

Vinesh Phogat | తన మేనకోడలు, భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌( Vinesh Phogat )పై అనర్హత వేటు పడటానికి భారత బృందం వైద్యులు, కోచ్‌లదే బాధ్యతని కోచ్‌, మాజీ రెజ్లర్‌ మహావీర్‌సింగ్‌( Mahavir Singh Phogat ) విమర్శించారు. విధి వికృత చర్యగా ఆయన ఈ ఉదంతాన్ని అభివర్ణించారు.

  • By: raj    sports    Aug 07, 2024 10:31 PM IST
Vinesh Phogat | వినేశ్‌ ఫొగట్‌పై అనర్హతకు వైద్యులు, కోచ్‌లదే బాధ్యత : మహావీర్‌సింగ్‌ ఫొగట్‌

Vinesh Phogat | న్యూఢిల్లీ: తన మేనకోడలు, భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌( Vinesh Phogat )పై అనర్హత వేటు పడటానికి భారత బృందం వైద్యులు, కోచ్‌లదే బాధ్యతని కోచ్‌, మాజీ రెజ్లర్‌ మహావీర్‌సింగ్‌( Mahavir Singh Phogat ) విమర్శించారు. విధి వికృత చర్యగా ఆయన ఈ ఉదంతాన్ని అభివర్ణించారు. ‘కోచ్‌లదే తప్పు. మంగళవారం వరకూ ఆమె బరువు సక్రమంగానే ఉంది. రాత్రి ఆమెకు ఇచ్చిన భోజనం వల్లే ఆమె బరువు పెరిగింది. ఆమెకు డైట్‌ ఏం ఇస్తున్నారో కోచ్‌లకు తెలుసు. మనకు తెలియదు’ అని మహావీర్‌ సింగ్‌ ప్రింట్‌ వెబ్‌సైట్‌కు తెలిపారు. ఆమె బరువు ఎందుకు పెరిగిందో కారణాలు వారు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆమె బరువు అనేది వారి బాధ్యతే అని ఆయన స్పష్టం చేశారు. ఒలింపిక్‌( Olympic ) నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని కాస్త సడలించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మహావీర్‌ ఫొగట్‌.. భారత స్టార్‌ రెజ్లర్లు గీతా ఫొగట్‌, బబితా ఫొగట్‌ తండ్రి. గీతా ఫొగట్‌ రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సాధించింది. రెండో కుమార్తె బబితా ఫొగట్‌ కూడా 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. 2016లో ఆమిర్‌ఖాన్‌ నటించిన దంగల్‌ సినిమా మహావీర్‌ తన ఇద్దరు పిల్లలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడం ఆధారంగానే తీశారు. మూడుసార్లు కామన్‌వెల్త్‌ చాంపియన్‌ అయిన వినేశ్‌, ఆమె సోదరి, 2016 ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌ రజత పతక విజేత ప్రియాంకకు కూడా మహావీర్‌ శిక్షణనిచ్చారు.

వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై మహావీర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త విన్నప్పటి నుంచి తనకు తిండికూడా సహించడం లేదని చెప్పారు. వినేశ్‌ విజేత అని ఆమె కోచ్‌లు, డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆమెను దెబ్బతీశారని ప్రపంచానికి చాటడం తన బాధ్యతని అన్నారు. ‘ఆమె స్వర్ణ పతకానికి చేరువలో ఉన్నది. ఆమె అనర్హత వేటుకు గురైందంటే నమ్మలేకున్నా. అది (ఒలింపిక్‌ స్వర్ణం) ఆమె నుదుటిపై రాసి లేదేమో’ అని ఆయన అన్నారు.

మరో మాజీ మల్లయుద్ధ యోధుడు షేర్‌సింగ్‌ (65)కు వినేశ్‌ ఫొగట్‌ చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచీ తెలుసు. మహావీర్‌ పక్కనే ఉన్న ఆయన కూడా ఈ అంశంలో స్పందించారు. ‘కోచ్‌లా? సిబ్బందా? డాక్టర్లా? ఎవరిని తప్పుపట్టాలో నాకు తెలియడం లేదు. కానీ.. ఆమెకు ద్రోహం జరిగింది’ అని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో కోచ్‌ కూడా అంతే ముఖ్యమని, ప్రతిదీ కోచ్‌పైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

వినేశ్‌ రాకకోసం తాను ఎదురు చూస్తున్నానని మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ చెప్పారు. ‘బిడ్డా.. నీకోసం తర్వాతి ఒలింపిక్స్‌ ఎదురు చూస్తున్నాయి. మా కోసం నువ్వు స్వర్ణం పతకం తెస్తావు’ అని ఆమెకు చెబుతానని అన్నారు.