ఈ ఏనుగుల గుహ‌.. రాబోయే మ‌హ‌మ్మారికి పుట్టినిల్లు

ఈ గుహ మరో మానవ హననానికి దారితీయబోతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్​లను ప్రపంచం మీదకి వదలడానికి ఈ గుహ సిద్ధంగా ఉందని వారంటున్నారు.

ఈ ఏనుగుల గుహ‌.. రాబోయే మ‌హ‌మ్మారికి పుట్టినిల్లు

కిట‌మ్ గుహ‌.. ప్రపంచంలోని అత్యంత ప్రమాద‌క‌ర‌మైన గుహ‌గా పేరుతెచ్చుకుంది. కెన్యాలోని మౌంట్ ఎల్గాన్ జాతీయ పార్కులో ఉంది. ఈ గుహ గోడ‌ల‌న్నీ ఎవ‌రో గీకిన‌ట్టుగా, త‌వ్విన‌ట్లుగా ఉంటాయి. మ‌నుషులే బంగారం, వ‌జ్రాల కోసం ఈ ప‌నిచేసిన‌ట్లు తొలుత భావించినా, ఇది ఏనుగుల ప‌ని అని త‌ర్వాత తేలింది.

ఈ గుహే అత్యంత ప్రమాద‌క‌ర‌మైన వైర‌స్‌లైన ఎబోలా, మార్‌బ‌ర్గ్‌ల‌కు పుట్టినిల్లుగా ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇప్పుడ‌దే వ‌చ్చే మ‌హమ్మారి, మార్‌బ‌ర్గ్ వైర‌స్‌కు కేంద్రంగా మార‌బోతోంద‌ని వైరాల‌జీ నిపుణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మార్‌బ‌ర్గ్ గురించి మ‌హమ్మారిగా మారే ప్రమాద‌ముంద‌ని హెచ్చరిక జారీ చేసింది.

వైరాల‌జీ నిపుణుల నివేదిక ప్రకారం, మార్‌బ‌ర్గ్ వైర‌స్ తీవ్రమైన ర‌క్తస్రావ జ్వరాన్ని క‌లిగిస్తుంది. ఇది శ‌రీరం కార్యాచ‌ర‌ణ సామ‌ర్థ్యాన్ని త‌గ్గించ‌డంతో పాటు, గుండె ర‌క్తప్రస‌ర‌ణ వ్యవ‌స్థకు హాని క‌లిగిస్తుంది. మ‌ర‌ణ రేటు 89 శాతం వ‌ర‌కు ఉన్న ఈ వైర‌స్ ఎబోలా వైర‌స్ జాతికి చెందిన‌దే. మ‌ధ్య ఆఫ్రికాలో విస్తృతంగా క‌నిపించే పండ్ల గ‌బ్బిలాలు ఈ వైర‌స్‌ను వ్యాపింప‌జేయ‌గ‌ల‌వు. మ‌నిషి నుంచి మ‌నిషికి త్వరగా వ్యాపించే ఈ వైర‌స్‌, బాధితుడు వాడిన వ‌స్తువుల ద్వారా, అత‌డి స్రావాల ద్వారా సోకుతుంది. ఇది సోకిన మూడు వారాల త‌ర్వాత గానీ, ల‌క్షణాలు క‌నిపించ‌వు. కానీ, మ‌లేరియా, ఎబోలా లాంటి గుర్తుల‌యితే క‌న‌బ‌డ‌తాయి. మ‌నిషి క‌ళ్లు గుంట‌లు ప‌డిపోవ‌డం, ముఖంలో ఎలాంటి భావాలు క‌న‌బ‌డ‌క‌పోవ‌డం, ముదిరిన త‌ర్వాత‌ కండ్లు, ముక్కు, నోటి నుంచి ర‌క్తస్రావం జ‌రుగుతుంది. దుర‌దృష్టవ‌శాత్తు ఈ వైర‌స్‌కు ఇంత‌వ‌ర‌కు ఎలాంటి మందూ క‌నుగొన‌బ‌డ‌లేదు. డాక్టర్లు మామూలుగా ఇచ్చే ట్రీట్‌మెంటే ఇస్తారు.

ఇదిలా ఉండ‌గా, 1980లో కిట‌మ్ గుహ‌ను ప‌రిశోధించడానికి వ‌చ్చిన ఒక ఫ్రెంచ్ ఇంజ‌నీర్‌కు, అనుకోకుండా శ‌రీరాన్ని క‌రిగించే మార్‌బ‌ర్గ్ వైర‌స్ సోకింది. చాలా తొంద‌ర‌గానే అత‌ను నైరోబీ హాస్పట‌ల్‌లో మ‌ర‌ణించాడు. ర‌క్తస్రావ జ్వరం సోకిన అత‌డి గురించి ఓ పుస్తకంలో వివ‌రించారు. ‘ముఖం క‌పాలం నుండి పూర్తిగా విడిపోయిన‌ట్లుగా అయింది. అంటే ముఖాన్ని క‌పాలానికి అంటిపెట్టే క‌ణ‌జాలం క‌రిగిపోయి క‌పాలం నుండి ముఖం వేలాడుతున్నట్టుగా అయిపోయింద‌’ని అందులో రాసారు. కొన్ని సంవ‌త్సరాల త‌ర్వాత డెన్మార్క్‌కు చెందిన ఓ బాలుడు కూడా ఇదే వైర‌స్‌కు బ‌ల‌య్యాడు. అత‌ను కూడా ఇవే ల‌క్షణాల‌తో మ‌ర‌ణించ‌డం జ‌రిగింది.

కిటమ్​ గుహ, దాంట్లోని విలువైన ఖనిజ లవణాల కారణంగా జంతువుల నుండి మనుషులకు సోకే వైరస్​లకు సంతానోత్పత్తి కేంద్రంగా మారిపోయింది. ఈ ఖనిజ లవణాలు కేవలం ఏనుగులనే కాకుండా, అడవిగేదెలు, హైనాలు, చిరుతలను కూడా ఆకర్షించాయి. ఏనుగులు ఖనిజ లవణాల కోసం 600 అడుగులు లోతున్న గుహను పదేపదే తవ్వి, తోడి విస్తరించాయి. దాంతో ఈ గుహను గబ్బిలాలు తమ ఆవాసంగా మార్చుకున్నాయి. లావాశిలతో రూపుదిద్దుకున్న ఈ కొండగుహ కెన్యాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం కూడా.