Foldable iPhone | 2026లో విడుదల కానున్న ఫోల్డబుల్ ఐఫోన్!.. సామ్సంగ్ జీ ఫోల్డ్కు పోటీ!

Foldable iPhone | స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆపిల్ ఎంతోకాలంగా ఊరిస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ ఓ అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం ప్రోటోటైప్ (P1) దశలో ఉన్న ఈ ఫోన్ ఈ ఏడాది చివరినాటికి అభివృద్ధి దశలను పూర్తి చేసి 2026 ద్వితీయాతార్ధంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు డిజిటైమ్స్ తాజా నివేదిక వెల్లడించింది. సరఫరా వర్గాల కథనం ప్రకారం, ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను మూడు ప్రోటోటైప్ దశలుగా అభివృద్ధి చేస్తుంది (P1 నుండి P3 వరకు), అనంతరం EVT (ఎంజినీరింగ్ వెరిఫికేషన్ టెస్ట్) దశలోకి ప్రవేశపెట్టనుంది. ప్రతి దశ సుమారు రెండు నెలల పాటు కొనసాగనుండగా, ఈ సమయంలో ట్రయల్ ఉత్పత్తులను సైతం చేపట్టనున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి ప్రారంభ పంపిణీ లక్ష్యం సుమారు 70 లక్షల యూనిట్లుగా ఉండనుందని ఊహాగానాలు. పటిష్టమైన డిజైన్ ప్రత్యేకతలో కూడిన ఈ మోడల్లో 7.8 అంగుళాల ఇంటర్నల్ డిస్ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్ప్లే, లిక్విడ్ మెటల్ హింజ్, సైడ్ మౌంటెడ్ టచ్ ఐడీ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. మడతపెట్టినప్పుడు 9.2 మిల్లీమీటర్లు, విప్పినపుడు 4.6 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్‌గా ఉండేలా దీన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. అయితే, ఫోల్డబుల్ ఐప్యాడ్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపిల్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అత్యధిక వ్యయం, ఫ్లెక్సిబుల్ డిస్ప్లేల తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, తక్కువ డిమాండ్ వంటివే ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా, ఈ ఫోల్డబుల్ ఐఫోన్ మడత ఫోన్లలో ప్రపంచంలో పెరుగుతున్న పోటీని మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్లతో ఈ ఫోన్ పోటీ పడనుంది. అమెరికాలో దీని ధర సుమారు 2,300 డాలర్లు (సుమారు రూ.1.99 లక్షలు) ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.