పాలమూరులో పాగా ఎవరిదో.. నువ్వా నేనా అంటూ పోటీ
పాలమూరు శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోరుకు తెరలేచింది. అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి

- హ్యాట్రిక్ కోసం శ్రీనివాస్ గౌడ్ ఆరాటం
- రెండోసారి గెలుపు కోసం ఎన్నం పోరాటం
- తొలి విజయానికి మిథున్ ప్రయత్నం
- ప్రజల నాడి పట్టేందుకు ముగ్గురు నేతల ఎన్నికల పోరు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోరుకు తెరలేచింది. అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. మళ్ళీ కుర్చీ దక్కించుకునేందుకు ఒకరు… రెండోసారి కుర్చీ లో కూర్చోవాలని మరొకరు.. మొదటిసారి అసెంబ్లీలో కాలుపెట్టాలని కొత్త అభ్యర్థి తహతహలాడుతున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునేందుకు ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం పోరాడుతున్నారు. ఆయా పార్టీల మ్యానిఫెస్టోలను నమ్ముకుని వాటిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నమ్మకం పెంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
ఈనియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఈపార్టీ అభ్యర్థులు ప్రచారం చేసేందుకు వెళ్లిన సమయంలో జనం తరలివస్తున్నారు. ఈ జనాన్ని చూసిన అభ్యర్థులు తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. చివరికి జనం ఏపార్టీ వైపు మొగ్గుచూపుతారో అని అభ్యర్థులు ఆలోచనలోపడ్డారు. ఓటరు నాడి పట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి మిథున్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
అభివృద్ధినే నమ్ముకున్న బీఆరెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు నియోజకవర్గంలో కనీవిని అభివృద్ధి ప్రజల కళ్లెదుట కనిపిస్తోందంటూ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ప్రచారాస్త్రంగా చెప్పుకొస్తున్నారు. గతంలో పాలమూరు అంటే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉండేదని. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా పాలమూరు అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పాలమూరు అంటే కరువు జిల్లా అనే స్థాయి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతున్నదని బీఆరెస్ శ్రేణులు చెపుతున్నాయి. సాగు, తాగునీటికి కూడా జనం కష్టాలు పడేవారని… ఇదంతా ఒకప్పుటి మాట కాగా, ఎప్పుడో పాలమూరును చూసిన వారు ఇప్పుడు ఈ ప్రాంతానికి వస్తే అబ్బురపరిచే అభివృద్ధి కనబడుతుందని ప్రజల ముందు ఉంచుతున్నారు.
ఒకప్పుడు ప్రధాన రహదారుల్లో వెళ్లాలంటే నరకం కనిపించేదని, ఇరుకు రహదారుల నుంచి విశాలమైన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్, శిల్పారామం, ఏకో పార్క్ వంటి అభివృద్ధి పనులు పాలమూరుకు కొత్త అందాలు తెచ్చిపెట్టాయని, ఈ అభివృద్ధి అంతా శ్రీనివాస్ గౌడ్ ఆలోచన లో వచ్చినవే అంటూ బీఆరెస్ ప్రచారం చేస్తోంది. మళ్ళీ గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ పొందాలనే ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
రెండోసారి విజయం కోసం ఎన్నం తపన
కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో కాలుపెట్టాలని తీవ్ర ప్రయత్నం మొదలు పెట్టారు. 2012లో జరిగిన పాలమూరు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి, అప్పటి తెరాస అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంపై అఖండ విజయం తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి.. తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
2018లో పోటీ చేసే అవకాశం రాలేదు. పాలమూరు నియోజకవర్గంలో మహాకూటమికి అవకాశం రావడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్ర శేఖర్ కు మద్దతుగా ఉండడంతో, కాంగ్రెస్లో ఉన్న ఎన్నం పార్టీ కోసం పనిచేసారు. ఈ ఎన్నికల్లో ఎర్ర శేఖర్ ఘోర పరాజయం పొందడంతో ఎన్నం బీజేపీలో చేరారు. ఓ సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఎన్నంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఎన్నం మళ్ళీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని పార్టీ సీనియర్ నాయకులు కొంత అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కల్పించుకుని సీనియర్ నేతలతో మాట్లాడి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నంను గెలిపించేందుకు నడుం కట్టారు. పెద్ద వర్గం అయిన ముదిరాజ్ లు ఎన్నంకు మద్దతుగా నిలిచారు. పాలమూరు లో నిర్వహించిన ముదిరాజ్ సభలో ఎన్నంను పెద్దఎత్తున సన్మానించారు.
మీవెంటే మేమూ ఉంటామనే సంకేతం ఇచ్చారు. భారీ సంఖ్యలో ఉన్న ముదిరాజ్ లు కాంగ్రెస్ వైపు రావడం ఎన్నంకు కలిసివచ్చింది. ఇటీవల మైనారిటీ వర్గం నేతలు పాలమూరులో కాంగ్రెస్ కు జైకొట్టారు. ఇది కూడ ఎన్నంకు ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఇవన్నీ ఎన్నంకు కలిసి రావడంతో రెండో సారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు.
జితేందర్ రెడ్డి వారసుడిగా మిథున్ రెడ్డి
పాలమూరు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి రాజకీయ వారసత్వంగా ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. తన తండ్రి అండతో పాలమూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిథున్ రెడ్డికి బీజేపీ క్యాడర్ మద్దతుగా నిలిచింది. తన తండ్రి రాజకీయ అనుభవం ఈ ఎన్నికల్లో మిథున్ కు కలిసి వచ్చినట్లయిoది.
ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై ఘాటైనా విమర్శలు చేస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. ఓవైపు ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ… మరోవైపు కేసీఆర్ అవినీతిని ఎండగడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మొదటిసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కుతూహలంలో మిథున్ రెడ్డి ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సిందే.